
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల బహిరంగ సభ వేదికగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అటు బహిరంగ సభ, ఇటు ముఖ్య నేతలతో సమీక్షలతో.. తెలంగాణలో అధికార సాధనపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
బీజేపీని గెలిపించడం ద్వారా అవినీతి, కుటుంబ పాలనకు తెరదించాలని.. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు సాగేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారని అంటున్నాయి. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీని సమాయత్తం చేయడం, కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా ఆదివారం అమిత్ షా పర్యటన సాగనుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తీవ్ర స్థాయిలో విమర్శలతో..
చేవెళ్ల సభలో అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్‌లపై అమిత్‌షా ఎన్నికల యుద్ధాన్ని మొదలుపెట్టనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, బీఆర్‌ఎస్ సర్కార్, అధికార పార్టీ నేతల తీరుపై అమిత్‌షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ వైఫల్యాలను, కుటుంబ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలను లేవనెత్తుతారని పేర్కొంటున్నాయి.
ఇక వచ్చే నెల 10న కర్ణాటకలో పోలింగ్ ఉన్నందున.. తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను కూడా ప్రభావితం చేసేలా చేవెళ్ల సభలో అమిత్‌షా ప్రసంగం ఉంటుందని నేతలు అంటున్నారు. ఆదివారం సంఘ సంస్కర్త బసవేశ్వర జయంతి నేపథ్యంలో లింగాయత్ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలా, కర్ణాటక ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లను బీజేపీకి అనుకూలంగా మలుచుకునేలా ప్రకటనలు ఉండొచ్చని చెప్తున్నారు.
చేరికలు, ఇతర అంశాలపై స్పష్టత
సభ అనంతరం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతో కీలక అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి చేరికలు, సంస్థాగత అంశాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు.
అమిత్‌షా పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతుందని.. బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందని అంటున్నారు. ఇక ఆదివారం చేవెళ్ల సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేతలు మురళీధర్‌రావు, ఈటల రాజేందర్ ఇతర నేతలు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment