ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్‌ | BJP Leader Vijayashanthi Interesting Tweet On BRS Cadre | Sakshi
Sakshi News home page

ఏరోజూ పదవి కోరుకోలేదు.. రాములమ్మ ఆసక్తికర ట్వీట్‌

Published Wed, Nov 1 2023 9:25 AM | Last Updated on Wed, Nov 1 2023 9:47 AM

BJP Leader Vijayashanthi Interesting tweet On BRS Cadre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏరోజూ పదవి కోరుకోలేదని తెలిపారు. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమ కోసమే తప్ప.. నేటి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, తనతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని స్పష్టం చేశారు.

‘25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్న. ఇప్పటికీ అనుకోకున్న కూడా.. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతాం అని కాదు.

నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ’ అని విజయశాంతి పేర్కొన్నారు.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ తీరుపై అసంతృప్తిగా కనిపిస్తున్నారు. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను పార్టీ సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆమె పార్టీ వీడతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అసమ్మతి రాగం వినిపిస్తున్న రాములమ్మను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ చైర్మన్‌ పదవి అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ప్రస్తావించడంతో ఆమె ఈ ట్వీట్‌ చేయడం వెనుక ఏ ఉద్దేశ్యం ఏంటనేదానిపై రాములమ్మ అభిమానులు, బీజేపీ శ్రేణులు యోచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement