సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే తమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఫలితాలే హైదరాబాద్‌లో రిపీట్ అవుతాయని, గ్రేటర్‌లో గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. జీహెంఎంసీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రేపటి బీజేపీ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. గ్రేటర్‌లో పొత్తులపై తమనెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.(చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: జనసేన)
బీజేపీ గెలుపు ఖాయం: లక్ష్మణ్
ఎల్‌ఆర్‌ఎస్ పోవాలంటే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇవ్వాలని బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై వెనక్కితగ్గడం ఖాయమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్యాచరణ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేపు బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ‘‘ఎక్కువ సమయం ఇస్తే బీజేపీ వాళ్ళు గ్రేటర్ పీఠం తన్నుకుపోతారని టిఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కుట్ర పూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 18 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 428 మందికి మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఓ మంత్రి లక్ష ఇల్లు చూపిస్తామని చెప్పి అభాసుపాలు అయ్యారు. సీఎం కేసీఆర్ మాట తప్పారు... ఏ ముఖం పెట్టుకుని ఆయన ఓట్లు అడుగుతారు. ఆరేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ప్రాణాంతక కరోనాను ఆరోగ్య శ్రీలో పరిధిలో చేర్చలేదు. హైదరాబాద్‌లోని బస్తీలన్నీ చెరువులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. టీఆర్‌ఎస్ కార్యకర్తల దోపిడీ కోసమే డబ్బు రూపంలో వరద సాయం చేశారు. హైదరాబాద్ ప్రజలు అధికార పార్టీని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఏదేమైనా బీజేపీ గెలుపు ఖాయం. మా పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. 26 విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతాం. మార్పు కోసం బీజేపీని గెలిపించాలి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓల్డ్ సిటీకి మెట్రోరైలు రాకపోవడానికి కారణం వాళ్లే!
అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘గ్రేటర్‌లో ఏం సాధించారు? దత్తత తీసుకున్న డివిజన్ వైపు సీఎం కేసీఆర్ ఎప్పుడైనా కన్నెత్తి చూశారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఓల్డ్ సిటీకి మెట్రో రైలు వెళ్లకపోవడానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే. మెట్రో పనులు ఆపిన కారణంగా 3 వేల 500 కోట్లు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు ఆగింది వాస్తవం కాదా ? ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడానికి టీఆర్ఎస్ కృషి చేయలేదు. అరేళ్ళలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి. అంతేగానీ ఎన్నికల తాయిలాలు చూపి కాదు’’ అంటూ మండిపడ్డారు.
ఇక సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, చేతలు ప్రగతి భవన్ దాటలేదంటూ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అభివృద్ధి తక్కువ.. ఆర్భాటాలు ఎక్కువ. చేసింది గోరంత... చెప్పుకునేది కొండంత’’ అని విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించినా బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీని ఆదరించండి... ఆశీర్వదించండి. అభివృద్ధి వైపు తీసుకువెళ్తాం’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేక్ నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరిపి, మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, టీఆర్‌ఎస్ 42 పోలింగ్ కేంద్రాలను ఒకే చోట పెట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment