
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బెండిగనహళ్లి నారాయణగౌడ(బీఎన్ బచ్చేగౌడ) తనయుడు, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని శరత్ గురువారం ధ్రువీకరించారు. హస్తం గూటికి చేరడం ఖాయమని, ఇదే నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. అయితే ఇందుకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. తన తండ్రికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పలేదని, మీడియా ద్వారా ఆయన తెలుసుకుని ఉంటారని శరత్ పేర్కొన్నారు. కాగా బీజేపీతో విభేదించిన శరత్ బచ్చేగౌడ స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగారు. హోసకోటె శాసన సభ స్థానానికి 2019 డిసెంబరులో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు.
ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్‌పై విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హోసకోటెలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, రాజీనామా అనంతరం బీజేపీలో చేరిన నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీగా ఆయనను శాసన మండలికి పంపిన కాషాయ పార్టీ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో శరత్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం గమనార్హం.
చదవండి: ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కే: బీజేపీకి సున్నా
చదవండి: పుదుచ్చేరి సంక్షోభం: తమిళిసై కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment