హైదరాబాద్ లో ఈ వారం జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం బీజేపీలో మాత్రమే కాదు... తెలంగాణా రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతాపార్టీ నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామాకాలు కూడా చేపట్టనున్నారు. ఇక కోవిడ్ తరువాత జరుగుతున్న తొలి పూర్తిస్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణాలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు రాజమార్గం నిర్మించనుంది.
చదవండి: బీజేపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్
జాతీయ రాజకీయాలపై కీలక నిర్ణయాలు..
ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ చైర్‌పర్సన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో సభ్యుడిగా ఉన్న పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక నాయకత్వంగా వ్యవహరిస్తారు. వీరితో పాటు పార్టీలో కీలకనేత అయిన హోంమంత్రి అమిత్ షా అదే విధంగా 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇందులో సభ్యులుగా ఉన్న 80 మంది ఆఫీసు బేరర్లు హాజరవుతారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపైనా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. పాతికేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్నినిలబెట్టుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వేళ్లనుంది. ఇక ఉపఎన్నికల్లో ఓటమితో పాటు పార్టీలో అంతర్గత కలహాల కారణంగా బలహీనంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో గెలుపుకోసం బీజేపీ ఈ సమావేశాల్లోనే స్ట్రాటజీ ఖరారు చేయనుంది.
పార్టీ నిర్మాణంపై దృష్టి
హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకత్వం కొన్ని కీలక నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలోని వివివిధ విభాగాలకు సంబంధించి కొత్తవారిని నాయకత్వ స్థానంలోకి తీసుకోవడంతో పాటు.. కొన్ని విభాగాలకు సంబంధించి బాధ్యతల మార్పు ఉండే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థలైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న స్థానాల్లోకి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది.. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగే చివరి జాతీయ కార్యవర్గ సమావేశం ఇదే.
జనవరి 2023తో నడ్డా పదవీ కాలం ముగియనుంది. దీంతో నడ్డా తరువాత జాతీయ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీలోని వివిధ విభాగాలు చేపడుతున్న కార్యక్రమాలపై బాధ్యులు సమావేశంలో అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పార్టీ పురోగతిని జాతీయ నాయకత్వానికి నివేదిస్తారు. ఇక గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జాతీయ నాయకత్వం ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణాపై ప్రత్యేక దృష్టి
జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా తెలంగాణా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారపక్షం టీఆర్ఎస్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దెదించడానికి కార్యవర్గ సమావేశం వేదికగా సమరశంఖం పూరించనుంది. జాతీయ నాయకత్వాన్ని పూర్తిగా తెలంగాణాకు తీసుకురావడం ద్వారా... తమ బలం ఏంటో చూపించాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో పాటు పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు హైదరాబాద్‌కు రానున్నారు.
కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాదు జిల్లాలకు సైతం జాతీయ నాయకులను తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు వివిధ జిల్లాల్లో సామాన్యులతో కలిసి బీజేపి దిగ్గజ నేతలు భోజనం చేయనున్నారు. ఇక హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రధాని మోదీని తీసుకెళ్లడం ద్వారా తెలంగాణా ప్రజలకు బలమైన సంకేతం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా పార్టీలో నూతనోత్సాహం తీసుకువచ్చి.. తెలంగాణాలో అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహంగా కనిపించతోంది. బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే... రాబోయే రోజుల్లో తెలంగాణా రాజకీయాలను కాషాయకెరటం ముంచెత్తబోతోంది.
-ఇస్మాయిల్, ఇన్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment