మేం టచ్‌ చెయ్యం బాబూ.. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా | BJP Not even to hold the TDP Janasena manifesto | Sakshi
Sakshi News home page

మేం టచ్‌ చెయ్యం బాబూ.. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా

Published Wed, May 1 2024 5:16 AM | Last Updated on Wed, May 1 2024 6:51 AM

మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరిస్తున్న బీజేపీ పరిశీలకుడు సిద్దార్థనాథ్‌ సింగ్‌

మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరిస్తున్న బీజేపీ పరిశీలకుడు సిద్దార్థనాథ్‌ సింగ్‌

పేరుకే కూటమి.. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా 

మోదీ ఫొటో పెట్టేందుకు కూడా ‘నో’  

బాబుకు విశ్వసనీయత లేదని సంకేతాలు 

2014లో మోదీ ఫొటోతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. అధికారంలోకి వచ్చి, హామీలకు తూట్లు పొడిచిన బాబు 

అడుగడుగునా ప్రజలను మోసం చేసిన టీడీపీ అధినేత.. బీజేపీకీ అంటిన మరక.. బాబును నమ్మలేమని బీజేపీ నిర్ధారణ 

మేనిఫెస్టోపై పార్టీ ముద్ర లేకుండా జాగ్రత్తలు.. ప్రధాని మోదీ, ఇతర నేతల చిత్రాలు ఉండకూడదని స్పష్టీకరణ 

పట్టుబట్టి చివర్లో మేనిఫెస్టోపై కమలం గుర్తునీ తీయించిన బీజేపీ 

అప్పటికప్పుడు మార్పించిన చంద్రబాబు.. 3 గంటలు ఆలస్యంగా విడుదల 

మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడని బీజేపీ నేతలు

సాక్షి, అమరావతి: దేశంలో విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఉమ్మడిగా మేనిఫెస్టో ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు. తద్వారా చంద్రబాబు హామీలకు బీజేపీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ గ్యారంటీ కాదని చెప్పింది. ఆ మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్తపడింది. దానిపై బీజేపీ నేతల ఫొటోలు, గుర్తు ఉండకూడదని ఆ పార్టీ ముందే స్పష్టం చేసింది. చంద్రబాబు కమలం గుర్తు వేయించినా, చివర్లో తొలగించాల్సి వచ్చింది. చివరికి ఆ మేనిఫెస్టోని తాకడానికి కూడా బీజేపీ నేతలు ముందుకు రావడంలేదు. 

2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, యువతకు జాబులు అంటూ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారు. ఆ మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ ఫొటోలు, మూడు పార్టీల గుర్తులు ఘనంగా ముద్రించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని హామీలకు మంగళం పాడారు. అడుగడుగునా ప్రజలను వంచించారు. రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులు, మహిళలను నిలువునా మోసం చేశారు. జాబులు లేక యువత అల్లాడారు. పైగా, ఐదేళ్లూ విచ్చలవిడి అవినీతి, దోపిడీ జరగడంతో మరోసారి చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆ నింద బీజేపీ పైనా పడింది. ఆ పార్టీ జాతీయ నేతలూ ఇదే నిర్ధారణకు వచ్చారు.  

బాబును నమ్మని బీజేపీ 
ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. 



బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు. 

అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. 

దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. అందుకే 12 గంటలకు జరగాల్సిన మేనిఫెస్టో విడుదల మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టోగానే చంద్రబాబు, పవన్‌ దాన్ని విడుదల చేశారు. బాబు, పవన్‌ ఫొటోలు, రెండు పార్టీల గుర్తులు మాత్రమే మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా కనీసం దాన్ని పట్టుకునేందుకు సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ ఇష్టపడలేదు. 

పవన్, చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసి ఫొటోలకు పోజు ఇస్తూ దాన్ని సిద్ధార్థనాథ్‌ను పట్టుకోవాలని ఒక వ్యక్తి ఇవ్వగా, ఆయన నిర్ద్వందంగా తిరస్కరించడం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలోనే కనిపించింది. చివరకు ఈ మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యతని చంద్రబాబు చెప్పడం గమనార్హం. బీజేపీ జాతీయ స్థాయిలో ఒకే మేనిఫెస్టో విడుదల చేస్తుందని, కాబట్టి ఏపీలో కూటమిలో మేనిఫెస్టోకి మద్దతు తెలిపిందని ఆయన సర్దిచెప్పుకున్నారు. 

సిద్ధార్థనాథ్‌సింగ్‌ కూడా తాము రాష్ట్రానికో మేనిఫెస్టో ఇవ్వడంలేదని చెప్పారు. నిజానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనూ వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించే ఆనవాయితీ ఉన్నా కేవలం చంద్రబాబుపై నమ్మకం లేకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement