సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర గురువారం కరీంనగర్‌లో ముగియనుంది. 15వ తేదీతో సంజయ్ 1,400 కి.మీ పైగా దూరాన్ని పూర్తి చేయనున్నారు. ముగింపు సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
రాష్ట్ర బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు హాజరవుతారు. మలివిడత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి రాజకీయంగా కేసీఆర్ గ్రాఫ్ పెరగడానికి, 2001లో కరీంనగర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ దోహదపడిందని బీజేపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇప్పుడదే చోట బీజేపీ బలం నిరూపించేలా సభను విజయవంతం చేయడం ద్వారా.. బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నారు.
సక్సెస్ అయ్యేలా సమీకరణ
ఉత్తర తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తల సమీకరణ ద్వారా ఈ సభను సూపర్ సక్సెస్ చేసే ఏర్పాట్లలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. పార్టీ గెలుచుకున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్ల పరిధిలో పార్టీకి అత్యధిక మద్దతు, పట్టు ఉండడంతో పాటు హిందూత్వ భావజాలం, యువకుల మద్దతు ఎక్కువగా ఉండడంతో సభ అంచనాలకు మించి విజయవంతం అవుతుందని వారు భావిస్తున్నారు.
కరీంనగర్‌లోనే పాదయాత్ర–6 ప్రకటన!
ఐదో విడత కూడా కలిపితే మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాత్ర కొనసాగినట్టవుతుంది. కాగా ఐదో విడతలో రాజకీయంగా అనేక ప్రాధాన్యత కలిగిన అంశాలు చోటుచేసుకున్నాయని పాదయాత్ర ప్రముఖ్ డా. గంగిడి మనోహర్‌రెడ్డి సాక్షికి తెలిపారు. సంజయ్‌ను భైంసా పట్టణానికి అనుమతించక పోవడాన్ని, తర్వాత ఆయన భైంసా అల్లర్ల బాధితులను కలుసుకుని భరోసా కల్పించడాన్ని, గల్ఫ్ బాధితులు, కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించడాన్ని, ఇతర పరిణామాలను గుర్తు చేశారు. ఇలావుండగా కరీంనగర్ సభావేదిక నుంచే పాదయాత్ర–6 షెడ్యూల్ ప్రకటనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గంగిడి తెలిపారు.
బీజేపీ నేతలతో నడ్డా భేటీ
నడ్డా గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తొలుత కర్ణాటక వెళతారు. కొప్పాల జిల్లాలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు కొప్పాల ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. ఎయిర్‌పోర్టులోనే పార్టీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం కరీంనగర్ బయలుదేరి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment