మహబూబా ముఫ్తీ
జమ్మూ: ఓట్ల కోసం బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని, కశ్మీరీ పండిట్ల ఆవేదనను, అగచాట్లను ఒక ఆయుధంగా వాడుకుంటోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు.
పరాయి ప్రాంతాలకు వలస వెళ్లిన హిందూ సోదరులు కశ్మీర్‌కు క్షేమంగా, గౌరవప్రదంగా తిరిగి రావాలని ఇక్కడ ముస్లింలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు కశ్మీరీ పండిట్లం అని చెప్పుకొంటూ ఢిల్లీలో టీవీ స్టూడియోల్లో కూర్చొని విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పండిట్లు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశ్మీరీ పండిట్లతో కూడిన ప్రతినిధి బృందం తాజాగా మహబూబా ముఫ్తీతో సమావేశమయ్యింది. కశ్మీర్‌లో ఇటీవల సామాన్య పౌరులపై ఉగ్రవాదుల దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తమ భయాందోళనలను ఆమె దృష్టికి తీసుకెళ్లింది. పండిట్లు వలస వెళ్లడం వల్ల కశ్మీరీ ముస్లింలు ఎంతగానో నష్టపోయారని మహబూబా ముఫ్తీ చెప్పారు. మనల్ని విడదీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పండిట్లకు పిలుపునిచ్చారు. (చదవండి: ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి)
Comments
Please login to add a commentAdd a comment