మాజీ మంత్రి హరీశ్‌రావు
నాడు రైతులకు అందిన మొత్తం రూ.1.20లక్షల కోట్లు
బీసీ, ఎస్సీ హాస్టళ్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.
కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు.
చిరుద్యోగుల వెతలు తీర్చండి
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment