
మహిళలకు బీఆర్‌ఎస్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీíసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఖండించారు.
‘మీ తండ్రి మీకు నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు. మహిళలను కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. పదేళ్లుగా హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది’ అని సీతక్క మండిపడ్డారు. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలనే వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం’ అని స్పష్టం చేశారు.
శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? అని ఆమె కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు.ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన మీకు రాలేదు. పదేళ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ’అని సీతక్క ధ్వజమెత్తారు.