మాయావతిని గజమాలతో సత్కరిస్తున్న ప్రవీణ్‌కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.
కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది
కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్‌లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్‌ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు.
అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్‌కుమారే సీఎం
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు.
బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు.
‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.
ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు.
బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment