నిర్మాలా సీతారామన్‌కు వినతిపత్రం ఇస్తున్న బుగ్గన
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా కేంద్రంతో అర్ధరాత్రి ఒప్పందం చేసుకొని పోలవరం ప్రాజెక్టుకు ద్రోహం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నీ రికార్డుల్లో ఉన్నాయని, నాడు జరిగినవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఏదైనా మంచి జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడమే. దురదృష్టవశాత్తూ విభజన తరువాత అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారు. కేంద్రం విధించిన షరతులకు ఒప్పుకున్నారు.
2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం పనుల్లో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు’అని పేర్కొన్నారు. 2017లో అంచనాలు సవరించాలని నిర్ణయించిన తర్వాత కూడా 2014 ధరల ప్రకారం చెల్లించాలని ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. పునరావాసం, భూసేకరణను వదిలిపెట్టడం తదితరాలన్నీ రికార్డుల్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు బుగ్గన తెలిపారు. ఖర్చు చేసిన నిధులు షరతులు లేకుండా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. సమావేశం వివరాలను సీఎం జగన్‌కు నివేదించి ఆయన సూచనల మేరకు మరోసారి కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఢిల్లీలో లేనందున కలుసుకోలేకపోయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment