కుప్పంలో అసలు ఏం జరిగింది?.. చంద్రబాబు హై డ్రామా ఆ భయంతోనేనా..? | Chandrababu Cheap Politics In Kuppam | Sakshi
Sakshi News home page

Kuppam: చంద్రబాబుకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్‌.. ‘కుప్పం’ కూడా చేజారిపోతుందా?

Published Thu, Aug 25 2022 6:29 PM | Last Updated on Thu, Aug 25 2022 7:23 PM

Chandrababu Cheap Politics In Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. కుప్పంలో తెలుగుదేశం గూండాల దాడులకు అనుగుణంగా చంద్రబాబు వీరంగం ఆడారు. కుప్పంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఎలా కాపురాలు చేస్తారో చూస్తానని బెదిరించారు. పార్టీ శ్రేణులను శాంతియుతంగా ఉండాలని తాను చెప్పలేనని పార్టీ నేతలు యోధుల్లా ధైర్యంగా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా  మంత్రులను ఉద్దేశించి ఖబడ్దార్ దమ్ముంటే కుప్పం రండి తేల్చుకుందాం అంటూ తొడగొట్టారు. రాజకీయాల్లో అర్ధ శతాబ్ధిగా ఉన్న నాయకుడు ఇటువంటి నేలబారు రౌడీ భాష మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: ‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’ 

కుప్పం నియోజక వర్గం తన చేజారిపోతోందేమోనన్న భయంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల్లో కుప్పం ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకూ ఎదురుగాలి తప్పదని కంగారు పడుతోన్న వేళ కుప్పం అభివృద్ధికి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించడంతో చంద్రబాబు వెన్నులో చలిమొదలైంది. ఈనేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ శ్రేణుల చేత  గూండాగిరీ చేయించిన చంద్రబాబు వారికి వత్తాసుగా తాను కూడా వీరంగం ఆడేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిపైనా, పోలీసులపైనా నోటికొచ్చింది అనేశారు. సీనియర్ పొలిటీషయన్ అని చెప్పుకునే చంద్రబాబు భాష చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.

ముఖ్యమంత్రీ ఖబడ్దార్.. ఏయ్ డీజీపీ జాగ్రత్త.. ఎస్పీ...ఏమనుకుంటున్నావ్? తమాషాగా ఉందా?. కుప్పంలో  కాపురాలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. పోలీసుల కతలు రెండు నిముషాల్లో తేల్చేస్తా. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి అంతు చూస్తాం. ఇవీ నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర మూటకట్టురకున్న పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న  చంద్రబాబు నాయుడి నేలబారు మాటలు. టీడీపీ కార్యకర్తలకూ కోపం వస్తుంది. ఓ స్థాయి దాటితే  ఆ కోపాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. కార్యకర్తలను పిరికిగా ఉండమని చెప్పలేను ప్రతీ కార్యకర్తా ఒక యోధుడిలా తయారు కావాలి. యువత ముందుకు రావాలి. ఇవీ  హుందాగా మెలగాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ చౌకబారు రౌడీ భాష అంతా కూడా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలోనివే.

విషయం ఏంటంటే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మరో పక్క జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజక వర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నడుం బిగించింది. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కుప్పం తలరాత మార్చారు జగన్‌మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్ననే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ అభివృద్ధి పథకాలు పూర్తి అయితే  కుప్పం ప్రజలు తనని అటకెక్కించేస్తారని కంగారు పడుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కుప్పం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చాలా కష్టమని తేలినట్లు సమాచారం.

ఆయన ఆ టెన్షన్లో  ఉంటే.. మరో వైపు జగన్‌మోహన్ రెడ్డి  వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంలో భాగంగా కుప్పం నియోజక వర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కుప్పం కూడా తనకు మిగలదన్న భయం చంద్రబాబు నాయుడికి కొద్ది రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో తరుచుగా పర్యటిస్తోన్న చంద్రబాబు  బుధవారం ఇక్కడకు వచ్చారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు వీధి గూండాల్లా ఊరిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డొచ్చిన వారిని చితక బాదారు. రాళ్ల దాడి చేశారు. మొత్తం మీద రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తోంటే చంద్రబాబు నాయుడు వారించలేదు. తమాషా చూశారు. ఈ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.

టీడీపీ గూండాయిజానికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ పార్టీ శ్రేణుల దాడులను చూస్తూ గడిపిన చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌ కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడులు చేశారని గగ్గోలు పెట్టారు. కుప్పంలో ఎన్నడైనా రౌడీయిజం చూశామా? ఎన్నడైనా ఇలాంటి దాడులు చూశామా? అంటూ బుగ్గలు నొక్కుకుంటూ చంద్రబాబు హై డ్రామా నడిపారు.

టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయి దాడులు చేస్తోంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో చంద్రబాబు కోపం అంతా పోలీసులపై పడింది. పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? నేను తలచుకుంటే మీ ఇంటిని కొట్టలేనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. 

‘మీ ఇళ్లు కూలిస్తే .. మీ కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై అవమానిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ‘ అంటూ తన స్థాయి మరిచి  హెచ్చరించారు. ఈ పోలీసులకన్నా బ్రిటిష్ వాళ్లే నయం అంటూ చంద్రబాబు  వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొవ్వెక్కిపోయిందన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో నేను వీధుల్లోకి వస్తా ఎవరొస్తారో చూస్తా అంటూ  వీధి రౌడీలా సవాల్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇంటికి వస్తా వేలమందిని వేసుకుని వస్తా మీ అంతు చూస్తా అంటూ బాలయ్య సినిమా టైప్ డైలాగ్ వదిలారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  వారిని పరోక్షంగా రెచ్చగొట్టారు చంద్రబాబు. ‘ మీకూ కోపం వస్తుంది. దాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకుంటే వారికే మంచిది అని  హెచ్చరిక స్వరంతో అన్నారు చంద్రబాబు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా  ప్రభుత్వ సలహాదారులంతా దమ్ముంటే కుప్పానికి రండి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. అందరి అంతూ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరికీ కాలం చెల్లిందంటూ దిగజారుడు భాష ప్రయోగించారు. అసలు కుప్పంలో మీరంతా కాపురాలు ఎలా చేస్తారో నేనూ చూస్తా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను హెచ్చరించారు.

చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో అర్ధం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వాడిన భాష చూస్తోంటే ఆయనకు మతి స్థిమితం తప్పలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఆయన పరుష పదజాలాన్ని చూస్తోంటే  ఆయన ఎంతకైనా దిగజారగలరని అర్ధం అవుతోందని వారంటున్నారు.

రౌడీయిజం చేసింది తెలుగుదేశమే. హింసాయుత ఘటనలతో బీభత్సం సృష్టించింది ఎల్లో గూండాలే. వారిని రెచ్చగొట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై దాడులు చేయించింది చంద్రబాబే. అన్నీ వారే చేసి  కుప్పంలో ఏదో జరిగిపోతోందన్నట్లు హై డ్రామా ఆడుతోందీ చంద్రబాబే అంటున్నారు పాలక పక్ష నేతలు. తన స్థాయికి కానీ తన హోదాకు కానీ తగని విధంగా చిల్లరగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు  వారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేసి  ప్రజల నుండి నిరాకరణకు గురయ్యారని అందుకే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్వకుండా మరింత పాతాళానికి దిగజారుతున్నారని వారు దుయ్యబడుతున్నారు.
చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement