నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం
చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిశోర్
అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు.. మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని డజనుకు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి
ఏ యంత్రాంగం లేని పీకే.. ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు
2019లోనూ లగడపాటి రాజగోపాల్‌తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు
ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి.. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం
రాజకీయంగా కలిసిరాక దిక్కుతోచని స్థితి
దాంతో ఇం‘ధనం’ కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం
తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో వికటించిన జోస్యం
వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పోచ దొరికినా ఆశగా దాన్ని పట్టుకుంటాడు. అలాగే ప్రజా వ్యతిరేక వరదలో కొట్టుకుపోతున్న చంద్రబాబు.. ప్రశాంత్ కిషోర్ అనే గడ్డిపోచ పట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కేయాలని తెగ ఆరాట పడుతున్నారు. అయితే ఈ గడ్డిపోచ పరిస్థితి ఇప్పటికే తెగిన గాలిపటంలా మారిందని దేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. మాకక్కర్లేదని రెండు జాతీయ పార్టీలు విసిరికొడితే ఉనికి కోసం పాట్లు పడుతున్న ఇతగాడు చంద్రబాబు గూటికి చేరారు. అలాగని ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పే ధైర్యం లేదు. రాజకీయాలకు పనికి రాక, ఒంటరిగా ఏమీ చేయలేక.. బాబు ఇచ్చింది పుచ్చుకుని ఆయన చెప్పిన మాటలను వల్లె వేస్తున్నారు.
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టినా.. కాంగ్రెస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నా వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయమని.. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌తో ఎప్పటికప్పుడు టీడీపీ గెలుస్తుందంటూ చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే రీతిలో ప్రశాంత్ కిశోర్(పీకే)తో టీడీపీకి అనుకూలంగా జోస్యం చెప్పిస్తున్నారు. నెల క్రితం వల్లె వేసిన మాటలనే ఆదివారం పీటీఐ ప్రతినిధుల భేటీలో మరోమారు చెప్పించారు.
అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన డజనుకుపైగా సర్వేల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. కానీ.. ఏ యంత్రాంగం లేని ప్రశాంత్ కిశోర్ – ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పే మాటలనే జోస్యంగా వెల్లడిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక లగడపాటిలానే ప్రశాంత్ కిశోర్ కూడా మాయం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పే
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ్ఞ చేసి.. ఐప్యాక్ నుంచి తప్పుకుని.. బీహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బీహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు.
ఇదే సమయంలో ఇక్కడ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంతో భయపడి ఢిల్లీలో తలదాచుకున్న లోకేశ్.. రాజకీయంగా బీహార్‌లో గిట్టుబాటుకాని ప్రశాంత్ కిశోర్‌ను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని కోరారు. ఆ క్రమంలోనే చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక.. ప్రశాంత్ కిశోర్‌ను సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేశ్ విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబు ఎదుట కూర్చొబెట్టారు.
అప్పుడు మాత్రం తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది.
డబ్బుల కోసమే ఆ మాటలు..
ఐప్యాక్ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిశోర్.. డబ్బుల కోసమే చంద్రబాబు చెప్పిన మాటలను తన జోస్యంగా వల్లె వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎలాంటి యంత్రాంగం, వ్యవస్థ లేని ప్రశాంత్ కిశోర్.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో రాష్ట్రాన్ని సీఎం జగన్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. అందుకే సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది.
ఇది సిద్ధం సభల్లో.. బస్సు యాత్రలో ప్రస్ఫుటితమవుతోంది. చెప్పిన మాటపై నిలబడని చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాగళం పేరుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నిర్వహించిన సభకు.. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. కూటమికి ఘోర పరాజయం తప్పదన్నది కళ్ల ముందే కన్పిస్తుండటంతో ఉనికి చాటుకోవడానికి ప్రశాంత్ కిశోర్‌తో పదే పదే తన మాటలను జోస్యంగా చంద్రబాబు చెప్పిస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment