ఆపండీ.. ఆపండీ.. ఆపండీ..
అసలు వరుడు వాడు కాదు.. వాడు డూప్లికేట్.. వీడే అసలు
ఆఖర్రోజు వరకూ మార్పులుంటాయమ్మా
టీడీపీ అభ్యర్థుల్లో ఇంకా సందేహాలు
ఇంకొన్ని చోట్ల మార్పులు చేసే అవకాశం
మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి.. పందిట్లో అందరూ సందడిగా ఉంటారు.. వధువు సిగ్గుల మొగ్గ అవుతుంది.. ఇటు వియ్యాలవారు కబుర్లు.. పిల్లల ఆటలతో అంతా కోలాహంగామా ఉంటుంది. ముహూర్తం టైం అవుతోంది.. వధువును పీటలమీద కూర్చోబెట్టండి.. అమ్మ నువ్వు జడ ఎత్తి పట్టుకోమ్మా.. బాబూ పెళ్ళికొడుకు నువ్వు తాళి కట్టు బాబు... ఏయ్ భజంత్రీలు మోగించడమ్మా అంటాడు పంతులు.. పెళ్ళికొడుకు లేచి తాళి కట్టబోతుండగా హఠాత్తుగా ఆహూతుల్లోంచి ఒకరు ఆపండీ.. డీ.. డీ... ఈ.. ఈ.. అని అరుస్తారు...
అక్కడంతా సైలెన్స్.. నిశ్శబ్దం.. ఏమి జరుగుతుందో తెలీదు.. ఎందుకు ఆపమన్నారో తేలేదు.. వధువు.. తల్లిదండ్రుల కన్ఫ్యూజన్.. అంతలో ఒక పెద్దాయన వచ్చి...అసలు వరుడు వీడు కాదు... వీడు డూప్లికేట్.. అసలైనవాడు ఇప్పుడొచ్చాడు.. వాడే అసలు పెళ్ళికొడుకు... నువ్వెళ్ళి తాళి కట్టుబాబూ అంటాడు.. అప్పుడు ఒరిజినల్ వాడు వెళ్లి తాళి కట్టి.. ఆ పెళ్లి తంతు ముగిస్తాడు..
వాస్తవానికి ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభర్ధులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో ప్రచారం చేయిస్తోంది. అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్లను మార్చేందుకు చంద్రబాబు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు.
ఉదాహరణకు ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టిక్కెట్ ప్రకటించేయగా అయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో మళ్లీ రఘురామకృష్ణం రాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతే కాకుండా జగపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా అయన జనంలోకి వెళ్తున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్యను ఓడించడం శ్రీనివాస్‌కు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట.
అలాగే టీవీల్లో అడ్డం దిడ్డం మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్‌కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు.. అయితే టీవీల్లో వాగడం వేరు.. జనాల్లో తిరగడం వేరని పార్టీకి ఇప్పటికే అర్థం అయిందని, దీంతో ఆయన్ను పక్కన బెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని అంటున్నారు. పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించారు.. ఈ నెలన్నర తరువాత ఆబ్బె... ఆయన సరిపోవడం లేదని తేలిందట.. దీంతో రెండో కృష్ణుడు రాబోతున్నట్లు రూమర్లున్నాయి. శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల రెండు.. మూడో కృష్ణుడు రాబోతున్నట్లు క్యాడర్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల వరకూ.. బీ ఫారం వచ్చేవరకూ ఎవరూ శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో క్యాడర్ పని చేస్తోంది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment