ఏది నిజం?: ప్రాజెక్టులనడుగుదాం.. నీళ్లెవరిచ్చారో?  | CM Jagan Dedication Develop Rayalaseema Yellow Media Fake Propaganda | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ప్రాజెక్టులనడుగుదాం.. నీళ్లెవరిచ్చారో? 

Published Wed, Dec 7 2022 5:35 PM | Last Updated on Wed, Dec 7 2022 7:32 PM

CM Jagan Dedication Develop Rayalaseema Yellow Media Fake Propaganda - Sakshi

గండికోట రిజర్వాయర్‌

విశాఖలో రాజధాని కోసం స్థానికులంతా గర్జిస్తే... అప్పుడు రామోజీరావుకు విశాఖలో  భూ కుంభకోణాలు కనిపించాయి. రాయలసీమ వాసులంతా ఏకమై మాకు ‘న్యాయ’ రాజధాని కావాలని ఇప్పుడు నినదిస్తే... రామోజీకి సడెన్‌గా రాయలసీమ వెనకబాటుతనం గుర్తుకొచ్చింది. పూర్తికాని ప్రాజెక్టులు మాత్రమే కనిపించాయి.  

కానీ... చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా బ్రహ్మం సాగర్‌ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 17.85 టీఎంసీల నీళ్లు నిండటం ‘ఈనాడు’కు కనిపించలేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 10 టీఎంసీలను నిల్వచేయటం ప్రస్తావించనే లేదు. ఇక గండికోట రిజర్వాయర్లో గరిష్ఠ సామర్థ్యానికి తగ్గట్టు 26.85 టీఎంసీల నీరు నిల్వచేయటం కూడా రామోజీకి పట్టదు. ఎందుకంటే... ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో చెయ్యలేని పనులు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మూడున్నరేళ్లలోనే సాధించిన విజయాలు. లీకేజీలకు అడ్డుకట్ట వేస్తే బ్రహ్మం సాగర్‌ బాగుపడుతుందని, పునరావాసం కల్పిస్తే గండికోటలో గానీ, చిత్రావతిలో గానీ గరిష్ఠంగా నీటిని నిల్వ చేయొచ్చని చంద్రబాబు నాయుడికి తెలియదా? మరెందుకు చేయలేదు? అప్పుడెందుకు రామోజీరావు ఇలాంటి కథనాలు రాయలేదు? ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వంపై కూడా పనిగట్టుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి... ‘న్యాయ’ రాజధానిగా చేస్తానని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పటం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. బాబుకు ఇష్టం లేనిదేదైనా... రామోజీకీ నచ్చదు కదా!!. ‘సీమ’ంతైనా మేలు చేశారా... అంటూ వండివార్చిన కథనంలో నిజమెంత? ఏది నిజం? చూద్దాం... 

ఒక్క నీరే కాదు. పరిశ్రమలు, వైద్య కళాశాలలు... ఇలా రాయలసీమ సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి. సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ఐదు వైద్య కళాశాలలు, రెండు క్యాన్సర్‌ ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటు చేస్తుండటం ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నడుంకట్టారు. ఒకటీ అరా పరిశ్రమలు కాదు... ఏకంగా పారిశ్రామిక క్లస్టర్లతోనే సీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలమైతే.. అక్కడ రాజకీయంగా తమకు నూకలు చెల్లినట్లేనన్నది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన. అప్పుడు తమ డీపీటీకి (దోచుకో..పంచుకో..తినుకో) శాశ్వతంగా తెర పడుతుందనే రామోజీరావు బాధ. అందుకే వికృతరాతలకు ప్రాణంపోస్తూ.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 

నిజానికిపుడు రాయలసీమలో బ్రహ్మంసాగర్, గండికోట, సీబీఆర్, వెలుగోడు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు ఇలా ఏ ప్రాజెక్టును చూసినా ఇపుడు నిండుకుండను తలపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందుతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టుల్లో నాలుగో వంతు కూడా నిండని పరిస్థితి. కొన్నిటికి లీకేజీలు... మరికొన్నిటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవటం... ఇలా అన్నీ సమస్యలే. వాటికి నిధులు ఖర్చుచేసి ప్రాజెక్టుల్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపాల్సిన ప్రభుత్వం ఆ ఊసే గాలికొదిలేసింది. ‘సీమం’తైనా న్యాయం చేయలేకపోయింది. కాకపోతే చంద్రబాబు ఏం చేసినా కరెక్టేనని చెప్పటమే తమ బాధ్యతగా భావించే ‘ఈనాడు’, దాని తోక పత్రిక, ఇతర ఛానెళ్లు ఈ వాస్తవాలను ఎన్నడూ చెప్పలేదు. ఇపుడు మాత్రం అకస్మాత్తుగా వాటికి రాయలసీమ గుర్తుకొచ్చింది. అమ్మో... సీమ అన్యాయమైపోతోందంటూ గుండెలు బాదుకుంటున్నాయి.  


చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

బ్రహ్మంసాగర్‌ రిజర్వాయరు గరిష్ఠ సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసి గరిష్ఠ సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేద్దామనే ప్రయత్నాలు చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీల నిల్వతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ఖరీఫ్‌ పూర్తయినా ఇప్పటికీ బ్రహ్మంసాగర్‌లో 15.11 టీఎంసీల నీరు నిల్వ ఉందనే విషయం రామోజీకి తెలియదా? ఎందుకు రాయరు? 

గండికోట రిజర్వాయర్‌ గరిష్ఠ సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం కల్పించే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్ఠంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇలాంటి వాస్తవాలను రాస్తే రాయలసీమకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!!. 

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ది (సీబీఆర్‌) కూడా గండికోట లాంటి కథే. దీని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్‌లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో 9.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇదీ వాస్తవం.  


బ్రహ్మంసాగర్‌ రిజర్వాయరు

గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలను తవ్వాలి. ఇందులో ఒకటి మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగంలో మిగిలిన 162 మీటర్ల పనులను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేక చేతులెత్తేశారు. ఫాల్ట్‌ జోన్‌లోని ఆ సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనంతో ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేయిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సొరంగం పూర్తి కాబోతున్నది కూడా. అప్పుడు గాలేరు–నగరి ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల  క్యూసెక్కులు తరలించడానికి మార్గం సుగమం అవుతుంది. రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో సొరంగాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు.

తాకట్టు పెట్టిన బాబే గొప్పా..? 
రాయలసీమ తాగు, సాగునీటికి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి అక్రమంగా నీటిని తరలించడానికి 2015లో తెలంగాణ సర్కార్‌ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపడితే నాటి సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్‌ ఎడాపెడా నీటిని తోడేస్తే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుంది. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువన ఉంటే కృష్ణా బోర్డు కేటయింపులున్నా సరే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉండదు.

ఈ నేపథ్యంలో 854 అడుగులకు దిగువన ఉన్నా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షణకు నడుం బిగించారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌. దీనిపై తెలంగాణ సర్కార్‌ ఎన్జీటీని ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాకనే రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించాలని ఎన్జీటీ ఆదేశించడంతో.. ఆ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసిన ప్రభుత్వం.. ఆ అనుమతిని తెచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కాకపోతే కబోదిలా మారిన రామోజీకి ఇవేవీ కనిపించవు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబే రామోజీకి ఆదర్శ నాయకుడు. ఎందుకంటే.. తన అక్రమాలకు రక్షకుడు కాబట్టి. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులను రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా రూ.43,336 కోట్ల వ్యయంతో చేపట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌. అదీ... సీమకు చేతల్లో చేస్తున్న న్యాయం. 

వైద్యంతో పాటు ‘న్యాయం’...  
వైద్య సౌకర్యాలలోనూ రాయలసీమ ముందుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏకంగా ఐదు మెడికల్‌ కాలేజీలను, రెండు క్యాన్సర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో వైద్య విద్య సీట్లు పెరగటమే కాదు... మెరుగైన వైద్యమూ అందుబాటులోకి రానుంది. ఇక శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుతో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఇప్పటికే ఈ నిర్ణయంలో భాగంగా లోకాయుక్త, వినియోగదారుల కోర్టుతో సహా కొన్ని న్యాయాధికార ప్రాంగణాలు అక్కడ కొలువుదీరాయి.

హైకోర్టు రావాలంటూ యావత్తు రాయలసీమ ఉద్యమిస్తోంది కూడా. కాకపోతే రామోజీరావుకు ఈ వాస్తవాలతో పనిలేదు. అందుకే అసలు రాయలసీమ వాసులెవ్వరికీ అక్కడ న్యాయస్థానం రావాలని లేదని, అందరూ అమరావతికే కట్టుబడి ఉన్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలెట్టారు. తాను కర్నూలు వెళ్లి అడిగానని, అక్కడి వారంతా అమరావతి రాజధానిగా ఉండటానికే అంగీకరించారని చెప్పటం ఆరంభించారు. దానికి కొనసాగింపుగానే... రామోజీ ఈ వంకర రాతలు మొదలెట్టారు. ఇదీ.. గురుశిష్యుల గూడుపుఠానీ. 

సీమలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి... 
వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపైనా సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహానేత వైఎస్‌ హయాంలో శ్రీ సిటీ రాకతో రాయలసీమ రూపు రేఖలు మారగా...... సీఎం జగన్‌  వైఎస్‌ఆర్‌ జిల్లా కొప్పర్తి వద్ద, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రెండు భారీ పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిని పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూడన్నరేళ్లలో వివిధ రంగాలకు చెందిన 29 భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టబడుల ప్రోత్సాహక కమిటి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ 29 ప్రాజెక్టులు ద్వారా రూ.88,333.66 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 76,992 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటిలో తిరుపతి జిల్లా ఇనగలూరు వద్ద హిల్‌టాప్‌ (అపాచీ) సెజ్‌ భారీ పాదరక్షల తయారీ, పులివెందులలో సుమీత్‌ ఫుట్‌వేర్, కొప్పర్తి వద్ద నీల్‌కమల్, పిట్టి లామినేషన్స్, నాయుడుపేట వద్ద గ్రీన్‌టెక్‌ ఎనర్జీ, చిత్తూరు జిల్లా ఎలకటూరు వద్ద అమ్యప్పర్‌ టెక్స్‌టైల్, తిరుపతి జిల్లా తమ్మినపట్నం వద్ద జిందాల్‌ స్టీల్, పులివెందుల వద్ద ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, బద్వేల్‌ వద్ద సెంచురూ ప్యానల్స్, కొప్పర్తి వద్ద కాసిస్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు తయారీ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి.

కేవలం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌. కర్నూల్‌ జిల్లా్ల ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రూ.428 కోట్లతో 74 ఎంఎల్‌డీ నీటి సరఫరా, కొప్పర్తికి రూ.150 కోట్లతో 46 ఎంఎల్‌డీ నీటి సరఫరా ప్రాజెక్టులను ఏపీఐఐసీ చేపట్టంది. ఎండాకాలంలో నీటి ఎద్దటి లేకుండా కొప్పర్తి వద్ద రూ.38 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిక్‌డిక్ట్‌ సహకారంతో ఓర్వకల్లు వద్ద 4,742 ఎకరాలు, కొప్పర్తి వద్ద 2,595 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇది కాకుండా రూ.750 కోట్లతో కొప్పర్తి వద్ద వైఎస్‌ఆర్‌ ఈఎంసీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ ఈఎంసీలో డిక్సన్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది. సెంచురీ ప్లై యూనిట్‌కు నీటి సరఫరా కోసం గోపవరం వద్ద రూ.45 కోట్లతో నీటి తరలిపంపు ప్రాజెక్టును అభివద్ధి చేస్తోంది.  పీఎం గతిశక్తి కింద రూ.31 కోట్లతో కృష్ణపట్నం నుంచి కొప్పర్తికి రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement