KCR Press Meet Highlights: CM KCR Shocking Comments On BJP And Bandi Sanjay - Sakshi
Sakshi News home page

CM KCR Press Meet: కేంద్రంపై కొట్లాటే..!

Published Tue, Nov 9 2021 3:56 AM | Last Updated on Tue, Nov 9 2021 11:31 AM

CM KCR Fires On BJP Government And Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే వరకు, పెట్రోల్, డీజిల్‌పై సెస్సు పూర్తిగా ఉపసంహరించుకునే వరకు కొట్లాడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులతో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. వరుసగా రెండోరోజు సోమవారం ప్రగతి భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టారు. తెలంగాణలో పండిన 3 కోట్ల టన్నుల ధాన్యం కొనే అంశం వదిలేసి వంకర టింకర మాటలు మాట్లాడారన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ధాన్యం కొంటారో లేదో చెప్పలేదు 
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి సొల్లు అంతా చెప్పిండు.. కానీ కేంద్రం ధాన్యం కొంటుందో లేదో మాత్రం చెప్పలేదు. తెలంగాణ రైతులు పండించే మొత్తం ధాన్యం కొనుగోలు చేసే వరకు మిమ్మల్ని వదలం. వేటాడతం. ప్రతి విషయంలో వెంటాడతం. వేటాడతం. ఎక్స్‌పోజ్‌ చేస్తం. ఎక్కడిదాకనైనా పోతం. వడ్లు కొంటరా? కొనరా? సూటిగా చెప్పాలి. గోల్‌మాల్‌ పద్ధతులు. హరాకిరి ముచ్చట్లు వద్దు. డీజిల్, పెట్రోల్‌పై సెస్‌ విత్‌డ్రా చేయాలి. చేస్తరా? సస్తరా? ఫస్ట్‌ అది చెప్పు. వడ్ల సంగతి చెప్పమంటే. వడ్లు విడిచిపెట్టి దొడ్లో నుంచి పారిపోయిండు. నువ్వా మా మెడలు వంచేది. నీ మెడలు మేము వంచుతం. అడుగడుగునా నిలదీస్తం. తిప్పి కొడ్తం. గింగిరాలు తిరగాలి. మేము యుద్ధవీరులం. భయపడే వాళ్లం కాదు. మేం ఏ తప్పు చేయలేదు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ అడ్డగోలు అధికార దుర్విని యోగం చేసి ఏమైనా చేయాలనుకుంటే మీరే గోల్‌మాల్‌ అవుతరు. మేము కాము. ఏ విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నం. మీకు సహకరించకపోతే కక్షసాధింపు చర్యలా? ఈడీ, ఐటీతో అడ్డగోలు దాడులా? మీతో దొంగలు భయపడ్తరు. మేమెందుకు భయపడ్తం..’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.  

రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాం 
    ‘యాసంగిలో కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసినందునే..వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాణం పోయే వరకు కొన ఊపిరితోనైనా రైతు ప్రయోజనాల కోసం, తెలంగాణ కోసం కొట్లాడుతాం. మీరు కాదు మీ జేజేమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. మేమే ఈ దేశానికి కంట్రిబ్యూటర్లం. దేశానికి అతి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశ ఖజానాలో మాకు వాటా ఉంది. ఇది మీ అయ్య సొత్తు కాదు. మంచి పథకం మేము ప్రారంభిస్తే కేసీఆర్‌ ఇంట్ల కాడనుంచి ఇస్తుండా? అని సోషల్‌ మీడియాలో వింత ప్రచారం చేస్తున్నరు. మీరిచ్చేది మీ ఇంటి నుంచా? ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయిలే అనుకుని ఇంతకాలం క్షమించినం. ఇంకా అట్లనే మొరుగుతామంటే 100 శాతం బుద్ధి చెబ్తాం. ఇకపై రోజూ విలేకరుల సమావేశం నిర్వహించి గట్టి జవాబిస్తా..’ అని తెలిపారు.  

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీయాలి 
    ‘కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేలు, లక్షల మంది రైతులతో ధర్నాలు పెడ్తున్నం. మిమ్మల్ని ఢిల్లీ వరకు వదలం. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఏ ఊరికి వచ్చినా ధాన్యం కొంటారా? లేదా ? అని ఎక్కడికక్కడ రైతులు నిలదీయాలి. పాదయాత్రలు చేస్తానంటావు. ఇక పాదయాత్రలు చేయి. రైతులు వచ్చి నిలదీస్తరు..’ అని అన్నారు. 

చమురు ధరలపై అబద్ధాలు చెప్తున్నరు  
    ‘దేశ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. అప్పుడు మళ్లీ రూ.77కే పెట్రోల్, రూ.68కే డీజిల్‌ వస్తుంది. మీరు (కేంద్రం) 16 సార్లు పెంచిన్రు. మేము ఒక్కసారి కూడా పెంచలేదు. విడి విడి వసూళ్లు ఉండకుండా 2015లో హేతుబద్ధీకరించినం. దాన్ని కూడా పెంచినట్టు అబద్ధాలు చెప్తున్నరు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగకున్నా తప్పుడు లెక్కలు చూపి సెస్సు పెంచారు..’ అని సీఎం ధ్వజమెత్తారు. 

ట్రాక్టర్‌ డ్రైవరా నువ్వు? 
     ‘కేసీఆర్‌ నీ ఫార్మ్‌హౌస్‌కు వచ్చి దున్నుతా అని నీ పాదయాత్రలో 50 సార్లు మాట్లాడినవ్‌. ఏం దున్నుతవ్‌? ట్రాక్టర్‌ డ్రైవరా నువ్వు?  నేను, నా కొడుకు పేరు మీద ఉన్న 100 ఎకరాల భూముల్లో బాజాప్త వ్యవసాయం చేసుకుంటున్నం. అది దాచిపెట్టేదా? వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలె. రాఫేల్‌ యుద్ధ విమానాల్లో కమీషన్లు తీసుకోవాలె?  వ్యవసాయం చేసుకుని బతుకుతున్నం. తప్పా. ముఖ్యమంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ఓ జాగా అమ్ముకున్న. రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్లు వస్తే ఫార్మ్‌ హౌస్‌లో పాత ఇళ్లు కూలగొట్టి రూ.2.5 కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకున్నం. మిగిలిన దాంట్లో రూ.3.75 కోట్ల ఆదాయ పన్ను చెల్లించిన. మేము దొంగ లెక్కల మీద బతికేటోళ్లం కాదు. మనకేమీ మనీ ల్యాండరింగ్‌లు, కంపెనీలు లేవు. దందాలు దొంగ వ్యాపారాలు లేవు. నేను పోయి సూట్‌కేసులు ఇచ్చినానా? సూట్‌ కేసులు ఇచ్చేది మీరు. దేశంలో ఈ రోజు ఎన్నికల్లో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది? హరాకిరి చేసేది మీరు. మీకు అనుకూలంగా ప్రజాతీర్పు రాకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది మీరే..’ అని విమర్శించారు.  

దా నా ఫార్మ్‌ హౌజ్‌ కాడికి.. ఆరు ముక్కలవుతవు కొడకా 
    ‘నీ ముక్కు బాగాలేదని ఒకడు..నీ ముడ్డి బాగాలేదని ఒకడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో ఏమేమో మాట్లాడినరు.  నువ్వు మందు తాగుతవు అన్నావు. నీకు తెలుసా ? నువ్వు వచ్చిపోసినవా? ఎప్పుడైనా వచ్చి మందు కలిపినవా? అలా మాట్లాడవచ్చా? నీ గురువులు నేర్పిన సంస్కారం ఇదేనా? అందుకే కదా నీ మెడలు విరగ్గొడ్త అన్నది. దా.. నా ఫార్మ్‌ హౌజ్‌ కాడ అడుగు పెట్టు.. ఆరు ముక్కలవుతవు నా కొడకా.. నీలాగా గెస్ట్‌ హౌస్‌ లేదు. అది ఫార్మ్‌హౌస్‌ కాదు.. ఫార్మర్‌ హౌస్‌. నా ఫార్మ్‌ హౌస్‌ దున్నతవా? నీ అయ్యదా నా ఫార్మ్‌ హౌస్‌. బాజప్తా కొనుక్కున్న భూములవి. ఎన్నికల అఫిడవిట్‌లో చూపిస్తం. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారివి, మా భూములు పోయాయి..’ కేసీఆర్‌ తెలిపారు. 

మీరు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? 
     ‘టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీగా ఉంటుందని 2014లోనే ప్రకటించినం.  కేబినెట్‌లో ఉద్యమకారులే ఉంటరా? సమపాళ్లలో ఉంటరు. ఉద్యమకారులకు సైతం వారి శక్తియుక్తలను బట్టి అవకాశాలు వస్తుంటాయి. ఇతర పార్టీల నుంచి సీనియర్లను తీసుకుని వారి సేవలను తెలంగాణ కోసం వినియోగించుకుంటాం. జ్యోతిరాదిత్య సింథియాను ఎందుకు కేంద్ర కేబినెట్‌లో పెట్టుకున్నరు? ఆయన ఏమైనా ఆరెస్సెసా..బీజేపీనా.. మీరు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? నీలాంటి ఎంపీలను ఎంత మందిని చేసిన నేను. నువ్వో తోకగాడివి. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంత కొత్త రాజకీయ నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌ సృష్టించింది. నువ్వా నా మీద మాట్లాడేది. నేను ఓ రాష్ట్రం, పార్టీ, జెండా సృష్టికర్తను. రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని గ్రామం లేదు, తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రూ.2 వేల పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంఇదే. దేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేస్తోందో ఆ పార్టీ నాయకులు చెప్పాలి..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు.  

దేశ ద్రోహి ఎవరో తేల్చుదాం 
    ‘బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే, చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై ఆ పార్టీ రెండు, మూడురకాల ముద్రలు వేస్తోంది. దేశద్రోహి అంటున్నారు. లేదంటే అర్బన్‌ నక్సలైట్‌ అనే పేరుపెట్టి వేధిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నోసార్లు పదవులు వదిలేసి ఉద్యమించిన వ్యక్తిని నేను. నేను దేశద్రోహినా? నేను యాడ దేశద్రోహం చేసిన. దేశం సరిహద్దులను చైనా వాడు ఆక్రమించుకుంటున్నడు.. కాపాడండి అనడం దేశద్రోహమా? భూభాగం కాపాడమన్నోడు దేశద్రోహా? మందికి విడిచిపెట్టినోడు దేశద్రోహా? ఈ సంగతిని తేల్చాలి. ఎవడైన గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. ఇదెక్కడి ఫిలాసఫి. రా..కమాన్‌. ఎవరు దేశద్రోహో తేల్చుదాం..’ అని సవాల్‌ చేశారు.  

తెలంగాణకు అన్ని రకాలుగా ద్రోహం చేసింది మీరే... 
    ‘దేశంలోని నీటి సంపద, కరెంట్‌ వాడే తెలివి తేటలు లేవు. 4లక్షల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నా 60శాతం నిరుపయోగంగా ఉంది. తప్పులన్నీ మీరు చేసుకుంటూ ఇతరులను బద్నాం చేస్తరా? వాస్తవాలు అడిగితే దేశ ద్రోహులా?  తెలంగాణ నీటి వాటా తేల్చడానికి ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయమని చెప్తే ఏడేళ్ల నుంచి చేతకావడం లేదు ఎందుకు? అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు ఎందుకు పోయినవు అని బండి సంజయ్‌ అంటడు. అందులో ఉండేదే ముఖ్యమంత్రులు. బుర్ర ఏమైనా ఉందా? పరిపాలన పరిజ్ఞానం ఉందా? ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నడవాలి కదా? ప్రస్తుత కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీలను తెలంగాణకు ఉన్నయి.  తాత్కాలిక పద్ధతిలో నీటిని వాడుకునే విధంగా సంతకం చేశా. ప్రజలకు నీళ్లు రావద్దా?  ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు ఏడ పండుకున్నరు. సీలేరు ప్రాజెక్టును ఆంధ్రకు ఇచ్చి ప్రధాని తెలంగాణకు శాశ్వత ద్రోహం చేసిండు. నన్ను ఫాసిస్టు అన్నవని ప్రధాని మోదీ అడిగిండు. నా కడుపు మండి అన్న అని ఆయనకు చెప్పిన. ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, రూ.450 కోట్ల బీఆర్జీఎఫ్‌ నిధులు, నవోదయ పాఠశాలలు, వైద్య కళాశాలలు ఇవ్వకుండా అన్ని రకాలుగా తెంలగాణకు ద్రోహం చేసింది మీరే. తెలంగాణ రైతుల పక్షాన శుక్రవారం ధర్నాకు కూర్చుంటం. నువ్వు కూర్చుంటవా?..’ అని ప్రశ్నించారు.  

ఎన్నికల సమయంలోనే కొత్త డ్రామాలు 
    ‘నేను రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇవ్వాలని చెప్పిన మాట వాస్తవం. తెలంగాణకు చాలినన్ని సాగునీరు వస్తే తప్పకుండా తీసుకుపోవచ్చని చెప్పా. ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పేంటి? ఎన్నికల సమయంలోనే బీజేపీ కొత్త కొత్త డ్రామాలు చేస్తది. తమిళనాడు, కర్ణాటక ఎన్నికలప్పుడు నదుల అనుసంధానం అంటూ హడావుడి చేసి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పార్టీ బీజేపీది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మ్యాండేట్‌ ఇవ్వకున్నా దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంగతి ప్రజలకు తెలుసు..’ అని ఎద్దేవా చేశారు. 

రెచ్చగొట్టాలి.. పబ్బం గడుపుకోవాలి 
      ‘మత విద్వేషాలే రగిలిస్తం. మా ఎజెండానే మతం అంటే ఇక మన దేశం ఏం బాగుపడుతుంది. మా కథనే మతం అని బండి సంజయే కదా రోజూ అనేది. అయితే సరిహద్దుల మీద, లేకుంటే మతం మీద రెచ్చగొట్టాలె. భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి..ఇదీ బీజేపీ తీరు..’ అని విమర్శించారు. 

గొర్రెల పథకానికి రుణం తీసుకున్నాం 
    ‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం సాయం చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా. ఈ పథకానికి నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) నుంచి రాష్ట్రం రుణం తీసుకున్నది. అందుకు ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నాం. అంతేకానీ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇచ్చినట్లు చూపిస్తే..రాజీనామా చేసేందుకు సిద్ధం. రాష్ట్రంలో 105 నియోజకవర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయిన పార్టీ బీజేపీ. అడ్రస్‌లేని పార్టీ, అబద్ధాలు చెప్పే పార్టీ నాయకులను ప్రజలు నమ్మరు. కేంద్రం రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఇచ్చిందని బండి సంజయ్‌ అన్నాడు. దేనిలో దేనికి ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి. గతంలో కూడా లక్ష కోట్లు ఇచ్చామని చెప్పిన అమిత్‌షా నుంచి క్షమాపణలు కోరిన. 17న తిరుపతిలో అమిత్‌షా నిర్వహించే సమావేశంలో తప్పకుండా మా ప్రభుత్వం పాల్గొంటది. నేను పాల్గొంటానా? లేదా ? తర్వాతి విషయం..’ అని సీఎం అన్నారు.  

మీలాగా బ్లాక్‌ మెయిల్‌ చేయం 
     ‘ప్రాజెక్టులు కట్టకపోతే కట్టలేదు అంటారు. కడితే కమీషన్లు తీసుకున్నారు అంటారు. దేశంలోని ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే చేసినరా?  మా పార్టీకి వచ్చే డబ్బుల లెక్కలు బాజాప్తా చెప్తున్నం. గతేడాది రూ.250 కోట్లు వచ్చాయని నాడు ప్లీనరీలో చెప్పిన. మల్ల రూ.200 కోట్ల వచ్చినయని ఈ ఏడాది ప్లీనరీలో కూడా చెప్పిన. రూ.450 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్‌ ఉన్నయి. ఇంకో 400 కోట్లు వస్తయి. నీకేందుకు కన్నుకుట్టు. మీ లాగా మందిని బ్లాక్‌ మెయిల్‌ చేయం. వారిని వీరిని బెదిరించం..’ అని అన్నారు.  

దయచేసి వరి వేయవద్దు.. 
    ‘దయచేసి రైతులు వరి వేయకండి. వీళ్లను నమ్మితే శంకరగిరి మాన్యాలు పడ్తం. వీళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. వీరి మాటను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోట్లేదు. వడ్లు తీసుకుంటవా? లేదా? అని కేంద్ర మంత్రిని ఫోన్‌ చేసి అడగవచ్చు కదా? రైతులకు వరి వేయమని చెప్పినందుకు ఈ రోజు ఢిల్లీ నుంచి (బండి సంజయ్‌కు) షంటింగ్‌ అయింది. అందుకే ఇప్పుడు వరి విషయం మాట్లాడట్లేదు..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

వీళ్లు వేసుకోవచ్చు... 
     ‘విత్తన కంపెనీలు, మిల్లర్లు, వ్యాపారస్తులతో ఒప్పందం కలిగిన రైతులతో పాటు సొంత వాడకం కోసం రైతులు వరి వేసుకోవచ్చు. ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. మద్దతు ధర ఎంత వచ్చినా పర్వలేదు అనుకునే వారూ పండించుకోవచ్చు. వరి కొంటాం అని కేంద్రంతో చెప్పిస్తే మేమే 75 లక్షల ఎకరాల్లో వరి వేయిస్తాం. కానీ ఈ కేంద్రాన్ని నమ్మి రైతులు మునగవద్దు. కొంటాం అని హామీ ఇస్తే వేసుకుందాం. కానీ వారి పరిస్థితి చూస్తా ఉంటే నమ్మకం కలగడం లేదు. రుణ మాఫీ చేయలేదని బండి సంజయ్‌ మాట్లాడిండు. ఈ టర్మ్‌లో రెండు దఫాలు చేసినం. మిగతాది చేస్తం.. ’ అని స్పష్టం చేశారు. 

పత్తి వేసుకుంటే అండగా ఉంటాం 
    ‘నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రిపేర్‌ చేసి రైతులకు అప్పగిస్తుంది. రైతులే సొసైటీలు పెట్టుకుని నడుపుకోవాలని అంటే వారు నిరాకరించారు. ప్రభుత్వం నడిపే జోలికి పోలె. చెరుకు విలువ పడిపోయింది. వర్షాకాలంలో కోటి ఎకరాల్లో పత్తి వేసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒకేసారి తీసేసే పత్తి పంట తీసుకొస్తున్నాం. వచ్చే ఏడాది 50–60 వేల ఎకరాలకు ఇస్తం. యాసంగిలో శనగలు వేసుకుంటే మంచి లాభం వస్తది. పెసర్లు, నువ్వులు వేసుకోవచ్చు. మినుములు, ఆవాలు వేసుకుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖే కొంటది..’ సీఎం హామీ ఇచ్చారు. 

దళితబంధుకు రూ.20 వేల కోట్లు 
     ‘దళితబంధు యథాతథంగా అమలు జరుగుతుంది. వచ్చే మార్చిలోగా హుజూరాబాద్‌ నియోజకవర్గం, మరో 4 మండలాల్లో ప్రతి కుటుంబానికి సంపూర్ణంగా, మిగిలిన నియోజకవర్గాల్లోని 100 వంద కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తాం. వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.20 వేల కోట్లను కేటాయిస్తాం. 2 లక్షల కుటుంబాలకు ఇస్తాం. వచ్చే ఎన్నికల నాటికి నాలుగైదు లక్షల కుటుంబాలకు ఇస్తం. నాలుగైదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికీ ఇస్తం. దమ్ముంటే ఈ పథకానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు తెప్పించాలి..’ అని సీఎం సవాల్‌ చేశారు.  

నవంబర్‌ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు  
    ‘కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నరు. రెండు మూడు రోజుల్లో నా దగ్గరే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంది. నవంబర్‌లో ఉద్యోగులను సర్దుబాటు చేసి వెనువెంటనే వచ్చే 60–70 వేల ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇస్తం. అవన్నీ నింపేస్తం. ప్రతి ఏటా ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుపుతూ ఉద్యోగ క్యాలెండర్‌ సైతం ప్రకటిస్తాం. దేశంలో ఇలా చేసే తొలి ప్రభుత్వం మాదే. మేము తెచ్చిన స్థానిక రిజర్వేషన్లతో 95 శాతం ఉద్యోగాలు మన పిల్లలకే వస్తయి. గెజిటెడ్‌ పోస్టులు కూడా మనోళ్లకే వచ్చేలా వాటిని జోనల్‌ పోస్టుల్లోనే పెట్టినం. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేను మాట్లాడినట్టు బండి సంజయ్‌ నిరుపిస్తవా? నేను ఎక్కడ లేదు. రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేసిండని బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ వాళ్లు రాష్ట్రానికి ఏమి చేశారో స్పష్టత ఇవ్వాలి. ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 80 వేల వరకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగం తక్కువగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది. కానీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం లక్షల ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ లక్షల కుటుంబాలను రోడ్డున పడేస్తోంది..’ అని సీఎం విమర్శించారు.     

హెలికాప్టర్లలో తిప్పి చూపిస్తా.. 
    రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నట్లు చెబితే లేదని బీజేపీ వాళ్లు బుకాయిస్తున్నారు. వాళ్లు వస్తే కళ్లకు కట్టినట్లు చూపిస్తా. 6 హెలికాప్టర్లు పెట్టి తిప్పి మరీ చూపిస్తా. అప్పుడైనా పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తారా? 

తెలంగాణలో ఎందుకు కొనరు..? 
రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? స్పష్టత ఇవ్వాలి. పంజాబ్‌లో పూర్తి ధాన్యం కొనుగోలు చేసే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదో తేల్చిచెప్పాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement