సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వినతి పత్రం అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో వెదిరె శ్రీరామ్, రజత్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ అక్టోబర్ 14 నుంచి అమలయ్యేలా ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు మరింత పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. ఈ విషయమై తొందరపెడితే తాము నష్టపోవాల్సి వస్తుందని నివేదించారు. సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి 7 గంటల నుంచి 8.40 వరకు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, రాష్ట్ర సాగునీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరిరామ్, ఎస్‌ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి షెకావత్.. రాజస్తాన్ మార్వాడ్ పాలకుడు దుర్గాదాస్ సింగ్ రాథోడ్ విగ్రహాన్ని జ్ఞాపికగా బహూకరించారు. ఈ సమావేశంలో మొత్తం ఐదు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించి పలు విన్నపాలు చేశారు.
షెకావత్‌కి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్
సమయం తక్కువగా ఉండటంతో సమస్యలు
కేంద్ర గెజిట్ అమలును అక్టోబర్ నుంచి కాకుండా మరికొంత గడువు ఇచ్చి అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. తొందరపడితే తెలంగాణ నష్టపోతుందని, బ్యాంకులు, రుణ సంస్థలు రుణ వితరణ జాప్యం చేసే ప్రమాదం ఉందని నివేదించారు. వివిధ అంశాలపై చర్చలు నడుస్తున్నందున అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని వివరించారు. సమయం తక్కువగా ఉండడంతో సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, తదితర సమస్యలు కూడా ఏర్పడతాయని, ఆంధ్రప్రదేశ్‌తో కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
ఏపీ రోజుకు 8 టీఎంసీలు తరలించాలని చూస్తోంది
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 8 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తరలించాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. అందువల్ల కృష్ణా జలాల పునఃపంపిణీకి వీలుగా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు వీలుగా సుప్రీంకోర్టులోని పిటిషన్‌ను తాము ఉపసంహరించుకున్నామని తెలిపారు.
ఆ 45 టీఎంసీలపై మాకు హక్కు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు మళ్లించినందున తమకు 45 టీఎంసీల వాటాపై హక్కు ఏర్పడుతుందని సీఎం తెలిపారు. ఈ నీటిని ఈ ఏడాదే కేటాయించాలని కోరారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే తమ వాటా వాడుకుంటున్నాయని నివేదించారు.
ఎత్తిపోతలకు విద్యుత్తు అవసరం
శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి ఆపాలన్న చర్చ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, ఎత్తిపోతల పథకాలు నడవాలంటే విద్యుత్తు అవసరమని నివేదించారు. బచావత్ అవార్డును అనుసరించే తాము విద్యుదుత్పత్తిని చేస్తున్నామంటూ, ఉత్పత్తిని కొనసాగించేందుకు హక్కు ఇవ్వాలని కోరారు.
గోదావరిలో ఆ 11 అనుమతి పొందినవే..
గెజిట్ నోటిఫికేషన్‌లో ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన గోదావరి బేసిన్ పరిధిలోని 11 ప్రాజెక్టులు తెలంగాణ ఆవిర్భావానికి ముందు ప్రారంభమైనవేనని కేసీఆర్ నివేదించారు. ‘అవన్నీ కూడా రాష్ట్రానికి ఉన్న 967.94 టీఎంసీల వాటాలో భాగమే. ఈ కేటాయింపుల నుంచి 758.76 టీఎంసీల మేర ప్రాజెక్టులు ఇప్పటికే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా అనుమతి లభించినవే. మరో 148.82 టీఎంసీలకు గాను హైడ్రాలజీ డైరెక్టరేట్ ద్వారా నీటి లభ్యత అనుమతి లభించింది. భవిష్యత్తు ప్రాజెక్టులు, ఆవిరి నష్టాలు మొదలైన వాటికి గాను మిగిలిన 60.26 టీఎంసీల మేర కేటాయింపులు రిజర్వ్ చేసి ఉన్నాయి..’అని వివరించారు.
నాలుగు ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి
‘గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీఈ) అవార్డు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85 టీఎంసీల కేటాయింపు ఉంది. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు 16 టీఎంసీల మేర సూత్రప్రాయ కేటాయింపులు ఉన్నాయి. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుకు 38 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. సంబంధిత అనుమతులన్నీ లభించాయి. ఈ రకంగా మొత్తం 155 టీఎంసీల మేర ఈ నాలుగు ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి. సంబంధిత పత్రాలన్నీ మీకు సమర్పిస్తున్నాం..’ అని కేసీఆర్ తెలిపారు.
ఈ నాలుగు ప్రాజెక్టులకు బదులుగా..
‘ఈ 4 ప్రాజెక్టులకు బదులుగా, 70 టీఎంసీల కేటాయింపుతో సీతారామ ప్రాజెక్టును, 60 టీఎంసీలతో దేవాదుల (తుపాకుల గూడెం వద్ద బ్యారేజీతో పాటు) ఎత్తిపోతల ప్రాజెక్టు, 4.5 టీఎంసీలతో ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల ప్రాజెక్టు, 3 టీఎంసీలతో రామప్ప – పాకాల లింక్, 2.14 టీఎంసీలతో మోదికుంట వాగు, 0.8 టీఎంసీలతో చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం 140.44 టీఎంసీలు పోను మరో 14.56 టీఎంసీల మేర వాడుకునే వెసులుబాటు ఉంది. సీడబ్ల్యూసీ ద్వారా ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల నుంచి ఈ ప్రాజెక్టులను చేపట్టినందున, ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలి..’ అని కోరారు.
అదనపు టీఎంసీకి అనుమతి అవసరం లేదు..
‘కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు అదనంగా ఒక టీఎంసీ ఎత్తిపోతల ప్రతిపాదన.. అదనపు ప్రాజెక్టు గానీ, కొత్త ప్రాజెక్టు గానీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిన 240 టీఎంసీల కేటాయింపులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో స్వల్పకాలంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం లేదు. కందకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు చిన్న నీటిపారుదల పథకం. కేవలం 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. దీనికి ఎలాంటి మదింపు అవసరం లేదు. రామప్ప– పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజీ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైనందున కొత్తగా అనుమతులు ఏవీ అవసరం లేదు. గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పటికే ఆమోదం పొందిన కడెం ప్రాజెక్టులో భాగం. కేవలం చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. దీనికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. కంతనపల్లి ప్రాజెక్టు ఉనికిలో లేని ప్రాజెక్టు. దీనిని ఆమోదం పొందని జాబితా నుంచి తొలగించాలి..’ అని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈమేరకు తగిన చర్యల నిమిత్తం జీఆర్‌ఎంబీకి, సీడబ్ల్యూసీకి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.