కోల్‌కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.
మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్‌లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్‌లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్‌ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.
ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్‌లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్‌ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.
ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.
ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment