
సాక్షి, మహబూబ్‌నగర్: పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి తొలి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలను మోసగించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో ఓట్లు అడగాలన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయమే తెలంగాణకు ఎక్కువ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దద్దమ్మ కేసీఆర్.
...అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. సిగ్గులేకుండా యాత్రలు చేస్తేమని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. బీజేపీ,బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ జాతీయహోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జిల్లా బీజేపీ నేతలు డీకే అరుణ,జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు.
...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తా. తెలంగాణలో 14 లోక్ సభ సీట్లు గెలిస్తేనే మన యుద్దం ముగిసినట్టు. కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలి. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబంద్ అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
చల్లా వంశీచంద్ రెడ్డి
2014లో బీఆర్‌ఎస్ పార్టీ హవాని తట్టుకుని మరీ కల్వకుర్తి నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహబూబ్ నగర్ ఎంపీగా కూడా పోటీ చేసి వంశీచంద్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రకటనతో వంశీచంద్‌రెడ్డి మరోసారి మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు.