చీకటి యుద్ధాన్ని 'ఎదుర్కొందాం': సీఎం జగన్‌ | CM YS Jagan Comments at Memantha Siddham Sabha In Nandyala | Sakshi
Sakshi News home page

చీకటి యుద్ధాన్ని 'ఎదుర్కొందాం': సీఎం జగన్‌

Published Fri, Mar 29 2024 4:59 AM | Last Updated on Fri, Mar 29 2024 6:50 AM

CM YS Jagan Comments at Memantha Siddham Sabha In Nandyala - Sakshi

నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న అశేష జనసందోహంలో ఓ భాగం

నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్‌ ఓనర్‌ 

సోషల్‌ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం 

పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు  

77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 

2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? 

ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది 

పిల్లల భవిష్యత్‌కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం

సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం 

రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం 

ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం 

మేనిఫెస్టో అంటే ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతి చంద్రబాబుది. మనం మాట చెబితే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99 శాతం హామీలు అమలు చేసి చూపించాం. ఈ మార్పుల్లో 10 శాతం లేదా 5 శాతం అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? మనం చేసిన దాంట్లో కనీసం 5 శాతం చంద్రబాబు చేసి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఎల్లో మీడియా, ఆయన మనుషులు మా బాబుకు ఒకటి కాదు పది రంగాల్లో నోబెల్‌ ప్రైజులు, 4 ఆస్కార్‌లు, మెగసెసే అవార్డులు ఇవ్వాలనే వారు. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ప్రచారం చేసేవారు. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, కర్నూలు: పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటున కూడా నమ్మొద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సైనికులేనన్నారు. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబీఎన్, టీవీ–5.. ఇంకా ఇలాంటి వారు తోడు లేరని.. ఎల్లో ఛానెల్స్, పత్రికలను బాబులాగా పోషించలేదని చెప్పారు.

అందువల్ల సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్‌ అని, ఒక ఛానల్‌ ఓనర్‌ అని దిశా నిర్దేశం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఎదుర్కోవాలని చెప్పారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంటా వివరించాలని కోరారు. పేదవాడి భవిష్యత్‌కు అండగా నిలబడేందుకు, మంచి చేసిన మన ప్రభుత్వానికి తోడుగా ఉండేందుకు, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలిపించేందుకు, రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మళ్లీ మనమంతా సిద్ధమై ఈ చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందామని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్‌ గురువారం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. జనం గుండెల్లో గుడి కట్టుకున్న మనల్ని ఎదుర్కొనేందుకు వారు జెండాలతో జత కట్టారని.. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు తరలి వచ్చిన ప్రజా సైన్యంతో నంద్యాల ఒక సముద్రంలా మారి ‘సిద్ధం’ అంటోందన్నారు.  సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 



డబుల్‌ సెంచరీ సర్కారును స్థాపిద్దాం 
► గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత.. అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత.. ఒక నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాము సింహాసనం ఎక్కుతామంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారా వారి పాలన మళ్లీ తీసుకువస్తానంటే ఒప్పుకోం అంటూ నంద్యాల నుంచి ఏలూరు వరకు, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజలంతా నినదిస్తున్నారు. 

► ప్రజల రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, మహిళ, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడతామని మూడు పార్టీలు చూస్తున్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా ‘అదృశ్య హస్తం’గా తోడుగా ఉంది. ఇటువైపు చూస్తే జగన్‌ ఒకే ఒక్కడు. అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు వీరికి తోడు బీజేపీ. పరోక్షంగా మరో పార్టీ కాంగ్రెస్‌. వీరు సరిపోనట్లు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5. ఇంతమంది కేవలం ఒకే ఒక జగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? (సిద్ధమే అని జనం నినాదాలు చేశారు). 

► పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటిలోకి తీసుకుపోదామని పొత్తులమారి, జిత్తుల మారి, ఎత్తులమారి పార్టీలన్నీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అందరం సిద్ధమవుదాం. మరోసారి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేసి, వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 స్థానాలు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్‌ సెంచరీ సర్కారును స్థాపించేందుకు సిద్ధమవుదాం. 

విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం  
► మీ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వం తీసుకురాని మార్పులను తీసుకువచ్చాడని గర్వంగా చెబుతున్నా. మీ గ్రామంలోనే మార్పు కన్పిస్తోంది. ఈ రోజు గ్రామంలోకి, పట్టణంలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం.. అందులో పది మంది అదే ఊరి పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే సెలవైనా, ఆదివారమైనా వలంటీర్లు అవ్వాతాతల వద్దకు వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు.    

► రైతు భరోసా కేంద్రం, నాడు–నేడు ద్వారా మారిన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, విలేజ్‌ క్లినిక్‌లు కన్పిస్తాయి. బర్త్‌ సర్టిఫికెట్, పింఛన్, రేషన్‌కార్డు లాంటి ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ వెళ్లి తలుపుతట్టి అందిస్తున్న పాలన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతే జరుగుతోంది.   

► రూ.2.70 లక్షల కోట్లు బటన్‌నొక్కి అక్కచెల్లెమ్మ­ల కుటుంబాల ఖాతాల్లోకి రూపాయి లంచం, వివక్ష లేకుండా అర్హులకు పథకాలు అందించాం. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పింఛన్‌ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, చేదోడు, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా అందిస్తున్నాం.   

► అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో దిశ యాప్‌ను పెట్టాం. బటన్‌ నొక్కితే చాలు, ఆపదలో ఉంటే పది నిమిషాల్లో పోలీసులు నేరుగా వచ్చి ఆదుకుంటున్నారు.   

► నాడు–నేడులతో ప్రభుత్వ బడులను మార్చింది.. గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీషు మీడియం, బైజూస్‌ కంటెంట్, పిల్లల బైలింగ్వల్‌ పుస్తకాలు, ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌బి ప్యానల్స్, డిజిటల్‌ తరగతులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ సిలబస్, ఐబీ ఇలాంటివన్నీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే వచ్చాయి.  

వైద్య, వ్యవసాయ రంగంలో సమూల మార్పులు  
► వైద్య రంగంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏకంగా 54 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రి­క్రూట్‌ అయ్యారు. నాణ్యమైన మందులు అందిస్తున్నాం. ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పా­టు చేస్నున్నాం. నంద్యాలలోనూ మెడికల్‌ కాలేజి కన్పిస్తోంది. ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా 2,300 రోగాలకు వర్తించేలా తీసుకెళ్లాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం.  

► ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబితే, నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్నాం. గ్రామ స్థాయిలో 10,600 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. కొత్తగా 108, 104 వెహికల్స్‌ 1500 కొనుగోలు చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్‌లను డాక్టర్లతో అనుసంధానం చేశాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పేదవాడికి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నాం. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగాయి.  

► రైతన్నలకు ఏటా వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రూ.13,500 ఇస్తూ, ఈ ఐదేళ్లలో రూ.67,500 అందించాం. 10,778 ఆర్బీకేలు విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నకు తోడుగా పని చేస్తున్నాయి. పగటిపూటే 9గంటల నాణ్యమైన విద్యుత్, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, చంద్రబాబు మూసేసిన చిత్తూరు డెయిరీ లాంటివి తెరిపించాం. అమూల్‌ ద్వారా పాడి రైతులకు తోడుగా నిలవడం ద్వారా లీటర్‌పై రూ.10–20 దాకా అదనంగా వచ్చేలా చేశాం. 22–ఏ కింద నుంచి తొలగించి 19.17 లక్షల మంది రైతులకు 34.75 లక్షల ఎకరాల్లో పూర్తి హక్కులు కల్పిస్తున్నాం.    

సామాజిక న్యాయంలో సువర్ణాధ్యాయం 
► సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయా­న్ని లిఖించాం. తొలిసారి నామినేటెడ్‌ పదవు­ల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. మంత్రి మండలి నుంచి 68 శాతం పదవులు ఈ వర్గాలకు ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు అదనంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వీటిలో 80 శాతం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇం­దులో 75 శాతం పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి.   

► అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం. రూ.16 వేల కోట్లతో 4 సీపోర్టులు, రూ.3,800 కోట్లతో పది షిషింగ్‌ హార్బర్‌లు కడుతున్నాం. రాష్ట్రంలో 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కన్పిస్తున్నాయి. 11 వేల ఆర్బీకేలు ఉ­న్నాయి. 11 వేల విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం.   

బాబు ధ్యాసంతా దోచుకోవడమే.. 
‘రాజకీయాల్లో నాయకుడు అంటే ‘అదిగో మా నాయకుడు’ అని కాలర్‌ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండాలి. మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికీ, ఏ గడ్డి అయినా తినేందుకు సిద్ధంగా ఉండే నాయకులు ఈ రాష్ట్రానికి కావాలా? ఇవాళ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ. లక్షలు కన్పిస్తాయి. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ మీ ఖాతాల్లో జమ చేశాడని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు ఇలా ఎందుకు చేయలేదంటే.. ఆయన ధ్యాసంతా దోచుకోవడం, పంచుకోవడమే.

మంచి జరిగింది మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. మంచి చేసిన జగన్‌ మీ అందరిని నమ్ముకుని ఎన్నికల బరిలో ఉంటే, చెడు చేసిన బాబు పొత్తులు, కుట్రలు, మోసాల్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు’ అని సీఎం జగన్‌ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బుగ్గన, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సు«దీర్, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలను గెలిపించాలని కోరారు.  మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 

ఇందులో ఒక్కటైనా నెరవేర్చారా? 
► ఈ కరపత్రంలో చంద్రబాబు సంతకం ఉంది. మోడీ ఫొటో ఉంది. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ ఫొటో ఉంది. 2014లో ఈ కరపత్రంతో పాటు ఇందులోని హామీలను టీవీల్లో ఊదరగొట్టారు.   
► రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు, రైతుల రుణ మాఫీ చేశాడా?  

► డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నారు. రూ.14,205 కోట్లు. ఒక్కరూపాయి అయినా చేశారా? 
► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తానన్నారు. మీ ఇంట్లో లేదా పక్కింట్లో పుట్టిన ఏ ఆడబిడ్డకైనా డిపాజిట్‌ చేశారా?   

► ఇంటింటికీ ఉద్యోగం.. లేదంటే రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తానన్నారు. 60 నెలల్లో ప్రతి కుటుంబానికి 1.20 లక్షలు ఇవ్వాలి. ఇచ్చారా?  
► అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానన్నారు. ఒక్కరికైనా ఒక సెంటయినా ఇచ్చారా?  

► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్, మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్, సింగపూర్‌కు మించి రాష్ట్రం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నారు. ఈ హామీలన్నీ 2014లో మోడీ, చంద్రబాబు, దత్తపుత్రుడి ఫోటోతో పంపారు. ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదు.. అని ప్రజలు నినాదాలు) ఇవన్నీ ఇవ్వకపోగా సూపర్‌ సిక్స్‌.. సెవెన్‌ అంటూ రంగురంగుల మేనిఫెస్టోతో మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తారట. 

చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? 
► మనం చేసిన మంచిలో కనీసం 5 శాతం అయినా చంద్రబాబు చేసి ఉంటే.. ఇదే ఎల్లో మీడియా చంద్రబాబు కంటే మరో నాయకుడు ప్రపంచంలో లేరని ఢంకా బజాయించేవారు. మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏదో తెలుసా! పేదల గుండెల్లో సంతోషం. వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, పిల్లల చదువుల్లో విప్లవం, వారి కుటుంబాల్లో సాధికారత, అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు.. ఇవీ జగన్‌కు కావల్సిన అవార్డులు, రివార్డులు. వీటి కోసమే జగన్‌ ఆరాట పడతాడు. ప్రయాస పడతాడు.  

► 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తుకు రాదు. ఆయన వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాత్రం అందరికీ తెలుసు. బాబు పేరు చెబితే వ్యవసాయం దండగ, బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు, రుణామాఫీ అని రైతులను నిలువునా ముంచేయడం, బాబు వస్తే కరువొస్తుందనే నానుడి, రెయిన్‌గన్‌తో కరువును జయించిన ఓ పిట్టలదొర గుర్తుకు వస్తాడు. ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలనే మాటలు గుర్తుకు వస్తాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement