సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, డి.కె.శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రేల సమక్షంలో చర్చించిన తర్వాత రాహుల్, ఖర్గేలతో మాట్లాడి వారి అనుమతి మేరకు కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు.
ముఖ్యంగా కేబినెట్‌లో ఎంతమందిని తీసుకోవాలి? ఎవరెవరిని తీసుకోవాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుని గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులందరి చేత ప్రమాణం చేయించనున్నారు.
డిప్యూటీ సీఎంలు ఒకరా... ఇద్దరా?
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని సీఎంగా నిర్ణయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకరిని నియమించాలా లేదా ఇద్దరికి అవకాశమివ్వాలా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతమున్న సమాచారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.
దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి గతంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కేబినెట్‌లో కీలక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాను భట్టికి మాత్రమే పరిమితం చేస్తారని, అలాగే భట్టితో పాటు మరొకరికి కూడా ఇస్తారనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది?
కొత్త మంత్రివర్గాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే అంశంతో పాటు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఎంపిక కాగా.. సీఎంతో పాటు నాలుగు లేదా ఐదు బెర్తులు వారికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)లకు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టేనని తెలుస్తోంది. టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), దొంతి మాధవరెడ్డి (వరంగల్)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు విప్ పదవులు కూడా ఈ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్‌లుగా ఉన్నత విద్యావంతులైన మహిళలు పరణికారెడ్డి, యశస్వినిరెడ్డిల్లో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.
వీరితో పాటు మల్‌రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొండ)లకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్య పదవులు లభించే అవకాశాలున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌రావు, జూపల్లి కృష్ణారావులలో ఒకరికి లేదంటే ఇద్దరికీ మంత్రిగా అవకాశం దక్కనుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మరోమారు కేబినెట్ మంత్రి బాధ్యత అప్పగించడం ఖాయమేనని, ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది.
బీసీలలో వీరికే..
తాజా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)కు కేబినెట్ బెర్తు ఖరారయిందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు మహిళా కోటాలో కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) పేరు ప్రకటన కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), వాకిటి శ్రీహరి (ముదిరాజ్), బీర్ల అయిలయ్య (యాదవ్)లలో ఒకరికి చాన్స్ దొరకొచ్చని అంటున్నారు.
ఎస్సీ కోటాలో రాజనర్సింహ ఖరారు
దళిత ఎమ్మెల్యేలకు కూడా కొత్త కేబినెట్‌లో తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం కసరత్తు సాగుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన భట్టిని ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ (ఆంథోల్)కు కీలక శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆయనతో మాదిగ వర్గానికే చెందిన మరొక నాయకుడికి కూడా అవకాశాలున్నాయని అంటున్నారు.
మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యంకు విప్ పదవి వస్తుందని, ఆయనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశం (నకిరేకల్)కు కూడా విప్ హోదా కల్పించే ప్రతిపాదనలున్నాయని సమాచారం. ఇక ఎస్టీ కోటాలో ధనసరి అనసూయ (సీతక్క)కు మంత్రి పదవి ఖాయమైనట్టే. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివాసీ వర్గాలకు చెందిన ఆమెతో పాటు లంబాడా సామాజిక వర్గం నుంచి ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), రామచంద్రనాయక్ (డోర్నకల్)ల పేర్లు వినిపిస్తున్నాయి.
ఖాళీగా కొన్ని బెర్తులు?
పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రిని, మంత్రులుగా మరో 17 మందిని నియమించే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఒకేసారి భర్తీ చేస్తారా.. రెండు నుంచి నాలుగు బెర్తులను ఖాళీగా ఉంచి తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ప్రాంతాల వారీ ప్రాధాన్యతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి జిల్లాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో అని బెర్తులనూ నింపకపోవచ్చని తెలుస్తోంది. ఇలా మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న అనేకమంది.. ఏఐసీసీ పెద్దలు, తమకు సన్నిహితులై ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో లాబీయింగ్ చేస్తుండటం గమనార్హం.
సామాజిక కోణంలో కేబినెట్ కూర్పు
Published Wed, Dec 6 2023 12:54 AM | Last Updated on Wed, Dec 6 2023 4:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment