సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ‘ఆరు గ్యారంటీ’ల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించిన విధంగా ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుకు అవసరం కానున్న నిధులపై ‘సాక్షి’విశ్లేషణాత్మక కథనం..
మహాలక్ష్మికి రూ.10 వేల కోట్లు!
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది.
♦ ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్ సబ్సి డీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది.
♦ మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారుగా రూ.2,200 కోట్ల వ్యయం కానుంది. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తే రూ.750 కోట్లు కానున్నాయి.
రైతు భరోసాకు రూ.29 వేల కోట్లు!
రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్టు అంచనా. వీరికి రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి ఏటా రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి.
అలాగే ఎకరానికి రూ.15 వేలు చొప్పున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ.22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ.3,000 కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, టన్నుకు రూ.500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ.29 వేల కోట్లు అవసరం అని అంచనా.
ఇందిరమ్మ ఇళ్లకు రూ.15 వేల కోట్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారు లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే అందుకు అవసరం కానున్న నిధులపై స్పష్టత రానుంది.
బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే, ఏటా కనీసం 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా.
యువ వికాసానికి రూ.10 వేల కోట్లు?
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు విషయంలో.. ఏ స్థాయి విద్య కోసం ఎంత మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ.10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి.
గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు..
గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9 శాతం గృహాలు) నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయి.
చేయూతకు రూ. 21 వేల కోట్లు
చేయూత పథకం కింద నెలకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామ ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తే ఏటా సుమారు రూ.20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment