వార్ రూం సమావేశానికి వస్తున్న రేవంత్‌రెడ్డి, పొన్నం, దామోదర్ రాజనర్సింహ
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌లో ఓటమికి నువ్వంటే.. నువ్వే కారణం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. వేదికలు మారినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆరోపణలు మాత్రం తగ్గలేదు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన హైకమాండ్ సమీక్ష సమావేశంలోనూ రాష్ట్ర నాయకుల ఆరోపణల పర్వం కొనసాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశం మరోసారి గ్రూపు రాజకీయాలకు వేదికైందని సమాచారం.
శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన మొదటి సమీక్షా సమావేశం గంటన్నర పాటు సాగింది. కాగా, సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమీక్షా సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ పార్టీ హైకమాండ్ తరఫున పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ సీనియర్ నేతలు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు, హుజూరాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్ హాజరయ్యారు.
కాగా ఉపఎన్నికలో పార్టీ వైఫల్యం, అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను వేణుగోపాల్ తెలుసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వేణుగోపాల్ సైతం ఓటమిపై సంజాయిషీ అడిగారని తెలిసింది. రేవంత్‌కు వ్యతిరేకంగా రాహుల్‌కు సురేఖ రాసిన లేఖ ప్రతిని ఈ సందర్భంగా హనుమంతరావు వేణుగోపాల్‌కు అందజేశారు. అయితే భేటీ తర్వాత పొన్నం పలు ఆరోపణలు చేయగా, ఆ సమయంలో అక్కడే ఉన్న రేవంత్ తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దంటూ బదులిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
అభ్యర్థిని నేనే ప్రతిపాదించా..
‘కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిపోవడం వల్లనే హుజూరాబాద్‌లో ఓడిపోయాం. పార్టీలో కొందరు టీఆర్‌ఎస్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిని నేనే ప్రతిపాదించా. ఎంపిక చేశా’. – పొన్నం ప్రభాకర్
కొందరు నన్ను కార్నర్ చేస్తున్నారు...
నాతో ఈటల ఫోన్‌లో మాట్లాడారు. కానీ, కలవలేదు. కౌశిక్‌రెడ్డితో నాకున్న బంధుత్వానికి, ఆయన పార్టీ వీడిపోవడానికి సంబంధం లేదు. అయినా జూలైలో కౌశిక్ కాంగ్రెస్‌ను వీడితే, అక్టోబర్ దాకా హుజూరాబాద్ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదు?. వెంకట్ స్థానికేతరుడు కావడం కూడా ఓటమికి ప్రధాన కారణం. కౌశిక్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న విభేదాలు, తగాదాలను నాకు రుద్దడం సబబు కాదు. కౌశిక్‌రెడ్డి అంశాన్ని సాకుగా తీసుకుని నన్ను కొందరు కార్నర్ చేస్తున్నారు. – ఉత్తమ్
సొంత ఇమేజ్‌పైనే శ్రద్ధ...
హుజూరాబాద్‌లో కొండ సురేఖను అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేయలేదు? తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించింది. కానీ, ఉప ఎన్నిక జరిగిన హుజూరాబాద్‌లో ఎందుకు సభ నిర్వహించలేదు? కొందరు నాయకులకు సొంత ఇమేజ్ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పార్టీ ఇమేజ్ పెంచడంపై లేదు.
– వి.హనుమంతరావు
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కంటే అన్ని రకాలుగా టీఆర్‌ఎస్, బీజేపీలు చాలా బలంగా ఉన్నాయని దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈటలతో కలిసి మాట్లాడాను కానీ, పార్టీలో చేరే విషయం చర్చకు రాలేదని భట్టివిక్రమార్క వెల్లడించారు. ఓటమి సమష్టి బాధ్యత అని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డి వెళ్లిపోవడం వల్లనే ఓడిపోయామని చెప్పడం సరైంది కాదని, పరస్పరం నిందలు వేసుకోవడం పార్టీకి మంచిది కాదని మధుయాష్కీగౌడ్ సూచించారు.
సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...
పార్టీని పటిష్ట పరుస్తున్నాం..
‘గతంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న సవాళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికీ సిగ్గులేకుండా అమిత్ షాతో బంధం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్.. అమిత్ షా పాదాల వద్ద తాకట్టుపెట్టారు. ధాన్యాన్ని కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని పటిష్ట పరచడమే కాకుండా, లోటుపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాం’ –మాణిక్యం ఠాగూర్
సీనియర్లతో కలసి పోరు...
‘హుజూరాబాద్ ఎన్నిక, పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలో కేంద్ర నాయకత్వం నుంచి పరిశీలకులు రాష్ట్రానికి వస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, అనవసర విషయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. దీనిపై సీనియర్లు అందర్నీ కలుపుకొని పోరాడుతాం. 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాం.’ – రేవంత్
యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం..
‘హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. అందరం కలిసికట్టుగా 2023 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పోరాడుతాం. దీనికోసం యాక్షన్‌ప్లాన్ రెడీ చేస్తున్నాం. బీజే పీ, టీఆర్‌ఎస్‌ల నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం’ –మల్లు భట్టివిక్రమార్క
నన్ను ఎవరూ సస్పెండ్ చేయలేరు..
‘పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇలాగైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టమే. హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కూడా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో కోరా. ఈటల రాజేందర్ రూపంలో దొరికిన ఆయుధాన్ని పార్టీ సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఉత్తమ్ నన్ను హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదు’. – పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment