సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో భారీ ప్రచార వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుతోంది. ఇప్పటికే అగ్రనేతలతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న టీపీసీసీ.. కాంగ్రెస్ పార్టీ పెద్దలను పూర్తిస్థాయిలో రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మిగతా ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుక్కులతో సభల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాష్ట్రానికి వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. తర్వాత 30, 31 తేదీల్లో ప్రియాంకా గాంధీ వస్తారని, పాలమూరు ప్రజాగర్జనతోపాటు నాగార్జునసాగర్‌లో జరిగే సభలోనూ ఆమె పాల్గొంటారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల 1, 2 తేదీల్లో రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి వచ్చి రెండో విడత బస్సుయాత్రలో పాల్గొననున్నారు.
నేతల అంగీకారం రాగానే..
అయితే ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ పాల్గొనే సభ మినహా మిగతా పర్యటనలు ప్రతిపాదనలేనని, నేతల అంగీకారం వచ్చాక షెడ్యూల్ ఖరారవుతుందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రచార పర్వం ముగిసే చివరి వారంలో మొత్తం కాంగ్రెస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపాలని టీపీసీసీ యోచిస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకుగాను.. నవంబర్ 23న రాజస్తాన్‌లో పోలింగ్‌తో నాలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగుస్తుందని.. ఆ తర్వాత ఏఐసీసీ పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల 23 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ సహా జాతీయ స్థాయి నేతలంతా ఇక్కడే మకాం వేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తారని వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment