సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని చెడగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తోందని, వారి అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని దుయ్యబాట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ప్రొజెక్టులోను టీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని అది అవినీతి ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై అమిత్ షా సీబీఐ విచరణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. చదవండి: ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తాం: కాంగ్రెస్
మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మతం, టీఆర్ఎస్ అవినీతితో పూర్తిగా కూడుకొని ఉందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని అంటున్నారు. అలాంటప్పుడు ఐటీ,ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతీ కేంద్ర మంత్రి తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్టు మాట్లాడుతున్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నాయిని ఠాగూర్ ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీ మతపరంగా విభజించాలని, టీఆర్‌ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేయాలని చూస్తుందన్నారు. తమ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి బల్దియాలో విజయం అందిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ అన్ని వర్గాలవారితో జీవనం సాగించే నగరమని గుర్తు చేశారు. దేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment