సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనువాదాన్ని పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. దళితులపై కేసీఆర్ కుటుంబానికి నిజంగా ప్రేమ ఉంటే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖను దళిత నాయకుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అధ్యక్షతన జరిగిన ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క దళితుడికి మాత్రమే అవకాశం ఇచ్చారని, ఆయన దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కీలకమైన సాగునీరు, విద్య, వైద్యం, పురపాలక శాఖలను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా దళిత నేత భట్టి విక్రమార్కను నియమిస్తే చూడలేక కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు.
పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని, దళిత నాయకులకు రాజ్యసభలో, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులుగా అవకాశం ఇచ్చింది కూడా తామేనని అన్నారు. దళిత సాధికారత కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా ఎస్సీ సెల్‌నేతలు కృషి చేయాలని మాణిక్యం పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయలేదు: రేవంత్
ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరోవేలులా ఉంటుందని, కానీ కాంగ్రెస్ పార్టీనే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదని, కానీ టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ఈ వర్గాల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ‘కాంగ్రెస్ కూడబెట్టిన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఒకవైపు మోదీ ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, ఉస్మానియా, కాకతీయలాంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి టీఆర్‌ఎస్ నేతలకు యూనివర్శిటీలు ఇచ్చి రిజర్వేషన్లు అమలు కాకుండా పేదలకు చదువు దూరం అయ్యేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’అని ధ్వజమెత్తారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సెల్ నేతలు గ్రామగ్రామాన పార్టీ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పారు.
దళితులపై జరిగే దాడులను ప్రశ్నించేందుకు గ్రామాల్లో ఎస్సీ కమిటీలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, వేంనరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment