రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు | Congress Leaders Spoke On Issues To Be Discussed In Assembly | Sakshi
Sakshi News home page

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు

Published Mon, Sep 7 2020 2:18 AM | Last Updated on Mon, Sep 7 2020 2:18 AM

Congress Leaders Spoke On Issues To Be Discussed In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న కాలంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు తెలుపుతారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2014, 18 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని, కానీ ఇప్పుడు కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని, వాళ్లంతా కాంగ్రెస్‌ వైపు వస్తున్నారని చెప్పారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులతో గాంధీభవన్‌లో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో కష్టపడి పని చేస్తున్నారని, పార్టీ కూడా పటిష్టంగా ఉందని వివరించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని, ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్ని స్తుందని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షులు అంశాలవారీగా పోరాటాలు చేయాలని, ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై కొట్లాడి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.  

ప్రజా సమస్యలపై కేసీఆర్‌ను నిలదీద్దాం: భట్టి 
ప్రజల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ వేదికగా నిలదీద్దామని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలు వంటి వాటిపై చర్చించడానికి టీపీసీసీ అధికార ప్రతినిధులతో గాంధీ భవన్‌లో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. అంశాల వారీగా సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు. వ్యవసాయం, నిరుద్యోగం, కరోనా రోగులపై నిర్లక్ష్యం, ప్రభుత్వ దవాఖానాల్లో లోపాలు, శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాదం, మైనారిటీ, దళిత వర్గాల సమస్యలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, నూతన రెవెన్యూ చట్టం, ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల పేదలపై భారం, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోడ్లు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి పలువురు అధికార ప్రతినిధులకు ఆయన బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బోరెడ్డి ఆయోధ్య రెడ్డి, ఇందిరా శోభన్, మొగుళ్ల రాజిరెడ్డి, కాల్వ సుజాత, సుధీర్‌రెడ్డి, సంధ్యా రెడ్డి, ఆశిరెడ్డి, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

అసెంబ్లీలో గళం వినిపిస్తాం: జగ్గారెడ్డి 
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వారి పక్షాన గళం వినిపిస్తామని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం లో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు డమ్మీగా మారిపోయారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని 40 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ ఏమైందని ప్రశ్నించారు. సంగారెడ్డి ఆస్పత్రికి నిధులు కేటాయించాలని, 57 ఏళ్ల వయసు వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని ప్రభు త్వాన్ని అడుగుతానని జగ్గారెడ్డి చెప్పారు. వచ్చే 15 రోజుల్లో మెడికల్‌ కాలేజీపై సీఎం హామీలు నెరవేర్చకపోతే తాను ఆరు రోజులు దీక్ష చేస్తానని తెలిపారు.  

‘బీసీల ప్రత్యేక బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోండి’ 
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో బీసీ సబ్‌ప్లాన్‌ కోసం అప్పటి ప్రజాప్రతినిధులతో మూడు రోజులు చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టం చేయాలని కోరారు. అలాగే బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా గత ఐదేళ్లుగా ఒక్కరికి కూడా రూ.లక్ష రుణం అందలేదన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఆదివారం సీఎం కేసీఆర్‌కు జాజుల లేఖ రాశారు.  
నిరుద్యోగుల గోస వినిపించండి: చనగోని 
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగుల గోస వినిపించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చనగోని దయాకర్‌ కోరారు. కనీసం ఉద్యోగ నియామకాలు కూడా లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, వారి పక్షాన బలమైన వాదనలు వినిపించాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ భృతి, యూనివర్సిటీల సమస్యలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్‌ చేశార 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement