సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వరుస ఓటములతో దెబ్బపై దెబ్బ పడుతోంది. పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే ముఖ్యనేతలు ఒక్కొక్కరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలకు క్యూ కడుతుండగా, తాజాగా అంజన్‌కుమార్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయడంతో నగర అధ్యక్ష పీఠం కూడా ఖాళీ అయింది. పీసీసీ ప్రమోషన్ కోసమే పదవికి రాజీనామా చేశానని అంజన్‌కుమార్ పేర్కొంటున్నా.. జీహెచ్‌ఎంసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనను పక్కన పెట్టడమే అసలు కారణంగా తెలుస్తోంది. మరోవైపు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు అనిల్ కుమార్‌కు సైతం సరైన ప్రాధాన్యం ఇవ్వక పోవడం లాంటి రాజకీయ పరిస్థితులు రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. కష్టకాలంలో ఒక వైపు అధికార పార్టీ దూకుడు..మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరు కోసం కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు పార్టీ శ్రేణులను మరింత కుంగతీస్తున్నాయి.
సంస్థాగతంగా... గత ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనపడి పరిస్థితి నిర్వీర్యంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకాగా, అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరగా, గత రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభా ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజల మద్దతు కూడగట్టుకోలేక పోవడంతో పాటు సంస్థాగతంగా బలపడడటంలో కూడా వెనుకబడి.. ఉనికిని కోల్పోయినట్లయింది.
బల్దియా ఓటమి నేపథ్యం..
నగర కాంగ్రెస్ పార్టీలో బల్దియా ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి. మాజీ మేయర్ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ పార్టీకి గుడ్‌బై చెప్పగా, పాతబస్తీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందే అగ్రనేతలతోపాటు పలువురు డివిజన్ స్థాయి ముఖ్య నేతలు సైతం పార్టీకి దూరమయ్యారు. మరోవైపు అగ్రనేతలు గూడురు నారాయణరెడ్డి, విజయశాంతి తదితరులు కూడా ఇతర పార్టీల్లో చేరారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి అధికార పక్షం ముందు కాంగ్రెస్ నిలబడలేపోయింది. తాజా రాజకీయ పరిణామాలతో ప్రదేశ్ కాంగ్రెస్‌తో పాటు నగర కాంగ్రెస్ రథసారథులు సైతం పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థంకంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment