సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పూర్తిస్థాయి రూప కల్పనకు మరో వారానికిపైగానే పడుతుందని, ఈ నెలాఖరు లేదంటే, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మేనిఫెస్టో విడుదలవుతుందని తెలుస్తోంది. నెలరోజులుగా వరుసగా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతూ ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను ఓ కొలిక్కి తెస్తోంది.
ఈ క్రమంలో శనివారం కూడా గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.సమావేశంలో కమిటీ సభ్యులు సంభాని చంద్రశేఖర్, చందా లింగయ్య, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా యువతకు ఉద్యోగాల కల్పనపైనే నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి పెద్దసంఖ్యలో టీచర్ పోస్టులు భర్తీ చేసే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించారు.
భారీసంఖ్యలో ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తా మని, తెలంగాణ యువతకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ ఉద్యోగుల కోసం పథకాలు రూపొందించాలని కూడా చర్చించారు. ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ మేనిఫెస్టోలో స్పష్టతనిచ్చే కోణంలో కూడా కమిటీ కసరత్తు జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment