రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వాదన గెలిచింది? ఏ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది? ఓటరు దేన్ని విశ్వసించాడు? దేనికి ప్రభావితుడయ్యాడు? సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. రాజకీయ పార్టీల విశ్లేషణ కూడా ఇదే. ఈసారి ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమ పథకాల హామీల్లో ప్రధాన పార్టీలూ పోటీ పడ్డాయి.
ఈ క్రమంలో సామాజిక సమీకరణలనూ తెరమీదకు తెచ్చాయి. ఇవి ఓట్లు రాలుస్తాయని భావించాయి. అయితే ఈసారి ప్రజాక్షేత్రంలో పార్టీల ప్రచారం, నినాదాలు ఒక స్థాయి వరకే పరిమితం కాలేదు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కొత్త అంశాలను అ్రస్తాలుగా ఎంచుకున్నాయి. ఈవీఎంలు ఫలితాలు నిర్దేశించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలే ఈసారి బలమైన ప్రభావం చూపాయనేది సుస్పష్టం. – సాక్షి, హైదరాబాద్
దూసుకెళ్లిన మార్పు
రెండు దఫాలు పాలించిన బీఆర్‌ఎస్ అభివృద్ధి మంత్రంతో మూడోసారి అధికారమివ్వమని కోరింది. దీన్ని బలమైన నినాదంగా ఆ పార్టీ భావించింది. కాంగ్రెస్ మాత్రం ‘మార్పు కావాలి ... కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. ‘ఒక్క అవకాశం ఇవ్వమనే’అభ్యర్థన బీఆర్‌ఎస్ నినాదం కన్నా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సంప్రదాయ కాంగ్రెస్ నినాదాలకు విరుద్ధంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళిన మార్పు కావాలనే నినాదం బలంగా పనిచేసినట్టు కన్పిస్తోంది.
అభివృద్ధి కన్పించిన జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్ ఈసారి ప్రతికూలత చవి చూడటమే ఇందుకు కారణం. తిరుగులేదని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో పాగా వేసింది. కాంగ్రెస్ ‘ఆరు హామీ’ల్లో కొద్దిపాటి కొత్తదాన్ని జొప్పించారు. మహిళలకు రూ. 2500, కౌలు రైతులు, రైతుకూలీలకు సహాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో కన్పించిన కొత్త అంశాలు. గ్రామీణ మహిళా ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టంగట్టడం చూస్తుంటే ఈ నినాదాలు ఆకట్టుకున్నాయనేది స్పష్టం. ఈసారి యువ ఓటరు పోలింగ్‌కు పోటెత్తడం, కాంగ్రెస్‌కు ఆకర్షితులవ్వడం విశేషం.
ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీకి... జాబ్ క్యాలెండర్‌ను జోడించడం మరింత నమ్మకాన్ని చేకూర్చింది. అధికార పార్టీ అవినీతి నినాదాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేసినా, బీఆర్‌ఎస్ బలమైన స్థానాలే కాదు... కాంగ్రెస్ బలమైన స్థానాల్లోనూ దీని ప్రభావం కన్పించలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అన్న రాజకీయ నినాదం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దీనివల్ల ప్రయోజనమూ పొందింది. కొన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్ పక్షానికి మళ్ళడం ఫలితాల్లో స్పష్టంగా కన్పిస్తోంది.
నిష్ఫలమైన బీఆర్‌ఎస్ అస్త్రాలు
బీఆర్‌ఎస్ తన పదేళ్ల పాలనలో అభివృద్ధినే నమ్ముకుంది. అమలు చేసిన సంక్షేమాన్నే ప్రచార ఆయుధంగా చేసుకుంది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, పెన్షన్లను నినాదాలుగా మార్చింది. పాజిటివ్ మార్గంలోనే ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. ప్రతీ పథకంలోనూ మరింత పెంపును జోడించింది. కానీ రానురాను బీఆర్‌ఎస్ ప్రచార సరళి మార్చింది. పాజిటివ్ నుంచి కాంగ్రెస్‌పై విరుచుకుపడే నెగెటివ్ సరళిని ఎంచుకుంది. దీన్ని ఆ పార్టీ అనివార్యంగా భావించింది.
‘మళ్ళీ కాంగ్రెస్ వస్తే...’కరెంట్ ఉండదు.. మత కలహాలు వస్తాయి... ముఖ్యమంత్రులు మారతారు... అభివృద్ధి కుంటుపడుతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేస్తుందని భావించింది. నెగెటివ్ ప్రచార సరళి అప్పటి వరకూ జరిగిన పాజిటివ్ ఓటింగ్‌ను డామినేట్ చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వల్ల నష్ట నివారణకు ... ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రజాక్షేత్రాన్ని ఇవేవీ అందుకోలేకపోయాయి. అభివృద్ధి కన్పించే ప్రాంతాల్లోనూ బీఆర్‌ఎస్ అనుకున్న రీతిలో లాభపడకపోవడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రజల అభిమానం చూరగొనలేని అభ్యర్థుల వల్ల బీఆర్‌ఎస్ ఎన్నికల అ్రస్తాలన్నీ నిష్ఫలమయ్యాయా? అనే చర్చ విన్పిస్తోంది.
కమలానికి కలిసి రాని బీసీ మంత్రం
బీజేపీ సీట్లు, ఓట్లు పెరగడానికి కారణాలేంటి? మోదీ, షాల ప్రచారమా? ఆ పార్టీ ఎన్నికల నినాదమా? అన్ని వర్గాల్లో జరిగే చర్చ ఇది. ఏడాది క్రితం ఊపు పెంచిన బీజేపీ ఎన్నికల వేళ చతికిల పడ్డా... ఆశాజనకమైన ఫలితాలనే చవిచూసింది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పింది. బీసీ నేతలకే ప్రధాన భూమికని చెప్పింది. అయితే, బీసీలుగా చెప్పుకునే బలమైన నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. దీన్నిబట్టి బీజేపీ బీసీ నినాదాన్ని ప్రజలు విశ్వసించలేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు
ఎక్స్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై ఏఐసీసీ అ«ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రజలకు ఎక్స్ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చామని, అయితే అక్కడి ఫలితాలు నిరాశపరిచాయని పేర్కొన్నారు.
ఆయా రాష్ట్రాల్లో పార్టీపై అభిమానం చూపి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డ కార్యకర్తల సేవలను గుర్తిస్తున్నట్లు వివరించారు. ఒడిదుడుకులను అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధపడతామంటూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గెలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు అభినందనలు
ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో గెలుపొంది అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా ఆయా పార్టీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచిన బీజేపీకి, పొరుగు రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
హామీలన్నీ అమలు చేస్తాం రాహుల్
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన, మద్దతు పలికిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరిత్ర సృష్టించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలిపారు. ఇది ప్రజలతోపాటు కార్యకర్తలందరి విజయమని ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు.
ఆశించిన విధంగానే ప్రజలు ఫలితాన్నిచ్చారు
కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నరకాసురుడి పాలనకు ముగింపు పలుకుతామని, హిట్లర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని ఏడాదిగా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెప్పినట్లుగానే ఫలితం ఇచ్చారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్, పాలేరు అభ్యర్థి గా గెలిచాక పొంగులేటి వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల అభీష్టం, అభిప్రాయాలకు భిన్నమైన పాలన సాగించడంతోనే బీఆర్‌ఎస్‌కు ఈ రకమైన ఫలితాలొచ్చాయని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై తీర్మానం చేస్తామని, వంద రోజుల్లోనే ఇవి కార్యరూపం దాల్చేలా చర్యలుంటాయని పొంగులేటి వెల్లడించారు.
గాందీభవన్ కళకళ
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గాందీభవన్ పరిసరాలు తొలిసారి కళకళలాడాయి. గత పదేళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినా గాందీభవన్ బోసిపోతూ కనిపించేది.
కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా గాంధీభవన్‌లో హడావుడి నెలకొంది. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఉదయం 9 గంటల నుంచే గాందీభవన్ బాట పట్టాయి. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ పార్టీకి ఆధిక్యం పెరగటంతో గాందీభవన్ పరిసరాలు మారుమోగాయి. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేడర్ సంబురాలు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment