ఇది మేనిఫెస్టోల సీజన్. అధికార పక్షాల మాటెలావున్నా విపక్షాల మేనిఫెస్టోలు అమల్లోవున్న విధానాలను ధిక్కరిస్తున్నట్టు, నిలదీస్తున్నట్టు కనబడతాయి. తమ రాకను నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తాయి. ప్రజానీకానికి అలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. న్యూఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోకు అలాంటి లక్షణాలు లేశమాత్రమైనా కనబడవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సెక్యులర్ విలువలకు తిలోదకాలిచ్చి హిందుత్వ రాజకీయాలనుపెంచి పోషిస్తున్నదని పదేళ్లుగా కాంగ్రెస్‌తో సహా వివిధ పక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ చిత్రంగా ‘న్యాయ్‌పత్ర’ పేరుతో విడుదల చేసిన 48 పేజీల మేనిఫెస్టోలో ఆ ప్రస్తావన లేదు. దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలు చట్టబద్ధంగా పనిచేసేలా, వాటిపై చట్టసభల పర్యవేక్షణవుండేలా చర్యలు తీసుకుంటామన్న వాగ్దానం వినసొంపుగానే వుంది.
కానీ తమ ఏలుబడిలోనే ఆ సంస్థలు భ్రష్టు పట్టడం మొదలైందని గ్రహించినట్టు లేదు! 27 పార్టీలున్న ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. గత ఆదివారం ఆ కూటమి ఆర్భాటంగా రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించింది. తీరా అధికార కూటమికి ప్రత్యామ్నాయం తామేనన్న విశ్వాసాన్ని కలగజేసే విధాన ప్రకట నకు మాత్రం కాంగ్రెస్ సిద్ధపడలేదు. వాగ్దానాలకేమి... మేనిఫెస్టోలో చాలావున్నాయి. వర్తమాన యుగంలో చాలా పార్టీలు అమలు చేయటం కోసం కాక జనాన్ని మభ్యపుచ్చటానికే ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. వీటి మోహంలో పడి జనం ఓట్లు కుమ్మరిస్తారన్నది ఆ పార్టీల అంచనా కావొచ్చు.
కానీ జనం తెలివిమీరారు. ఆచరణేమిటన్నది గమనిస్తున్నారు. ఉదాహరణకు ప్రజా ప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తోంది. కానీ కళ్లముందు తెలంగాణలో బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌కు గోడ దూకుళ్లు స్పష్టంగా కనబడుతుండగా ఈ వాగ్దానానికి విలువుంటుందా? గతంలో బీఆర్‌ఎస్ చేసింది కనుక తామూ అదే చేస్తున్నామన్న సంజాయిషీ చెల్లదు. తానూ ఆ తానులోని ముక్కనేనని కాంగ్రెస్ చెప్పదల్చుకుంటే ఇలాంటి వాగ్దానాలకు చోటీయకూడదు.
మేనిఫెస్టోలోని ‘పాంచ్ న్యాయ్–పచ్చీస్ గ్యారంటీస్’లో సామాజిక న్యాయం గురించిన హామీ వుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో ఈ అంశాలు ప్రస్తావన కొచ్చినవే. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, సమానత్వం వగైరాలు ఈ మేనిఫెస్టోలో వున్నాయి. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్న కులగణనకు కాంగ్రెస్ సంసిద్ధత తెలిపింది. స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పిస్తామన్న వాగ్దానం కూడా వుంది. తమ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వహయాంలో ఈ పని ఎందుకు చేయలేకపోయారో మేనిఫెస్టో చెప్పలేదు.
కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులైనా వివరణనివ్వలేదు. విద్యార్థులు బ్యాంకులు నుంచి తీసుకొన్న విద్యారుణా లను రద్దు చేస్తామన్న హామీ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తుంది. కానీ ప్రభుత్వరంగంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ఎందరు విశ్వసిస్తారన్నది అనుమానమే. ఎందుకంటే ఆ విష యంలో గత యూపీఏ సర్కారు తీరు నిరాశాజనకం. అటువంటి అసంతృప్తి ఉండబట్టే అప్పట్లో అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత భారీయెత్తున పాల్గొ న్నది. రిజర్వేషన్లపై ఇప్పుడున్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా కల్పిస్తామని మేనిఫెస్టో చెబుతోంది.
అలాగే నిరుపేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు నేరుగా అందజేస్తామని అంటున్నది. 2018 ఏఐసీసీ సదస్సు దేశం మళ్లీ బ్యాలెట్ ఎన్ని కలకు మళ్లాలని తీర్మానించింది. కానీ చిత్రంగా మేనిఫెస్టో ఈవీఎం విధానంవైపే మొగ్గింది. అయితే ఎన్నికల చట్టాలను సవరించి ఈవీఎంలు, వాటికి అనుసంధానించే వీవీ ప్యాట్‌లు మరింత పార దర్శకంగా వుండేలా చూస్తామంటున్నది. అగ్నిపథ్ స్కీం రద్దు, జమ్మూ, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా, న్యాయమూర్తుల నియామకాలకోసం ఎన్‌జేసీ, జీఎస్టీ చట్టాల ప్రక్షాళన వగైరా సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారపక్షంపై ఏయే అంశాల్లో విమర్శలున్నాయో చూసుకుని వాటన్నిటినీ మేని ఫెస్టోలో గుదిగుచ్చిన వైనం కనబడుతోంది.
వోటర్లను ఆకర్షించటానికి అవతలి పార్టీకి మించి వాగ్దానాలు చేయటం, అధికారంలోకొచ్చాక వాటిని విస్మరించటం మన దేశంలో కొత్తగాదు. కానీ సైద్ధాంతికంగా అధికార పక్షానికి ప్రత్యా మ్నాయం అనే భావన కలగజేయటానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నించలేదు. దాని ఆచరణ సైతం అదేవిధంగా వుంటున్నది. కేరళలోని వైనాడ్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పార్టీ జెండాలు లేకుండానే రాహుల్ నిర్వహించిన రోడ్ షో చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. బీజేపీపై ప్రధానంగా పోరాడుతున్నామంటూనే ఆ పార్టీ బలంగా వున్న ఉత్తరాదిని విడిచిపెట్టి రాహుల్ కేరళకు ఎందుకు వలస వచ్చారో కాంగ్రెస్ చెప్పలేకపోతోంది.
ఆ సంగతలావుంచి రాహుల్ రోడ్ షోలో జెండాలు కనుమరుగవటానికి గల కారణాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. 2019లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతోపాటు కనబడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ జెండాతో పోల్చటంతో ఈసారి అవి రెండూ కనుమరుగయ్యాయి. ముస్లింలీగ్ జెండా ఏమిటో తెలియకుండానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందా? సెక్యులర్ విలువలు పాటిస్తున్నామంటూనే ఇలాంటి విమర్శలకు బెదరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం ఈ ధోరణినే ప్రతిబింబించింది.
Comments
Please login to add a commentAdd a comment