
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టడం ద్వారా మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో కనీసం 12 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందే దిశలో కార్యాచరణ రూపొందించుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే అన్ని పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తలుగా రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలను నిర్వహిస్తోంది.
అనుబంధ సంఘాల ఆసరాగా
లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయాన్ని బట్టి కనీసం 12 స్థానాలు సులువుగా సాధించగలమనే అంచనాతో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరిని ఇంచార్జిగా నియమించగా, కొన్ని చోట్ల రెండు స్థానాలకు ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ స్థానాల వారీగా పార్టీని సమన్వయం చేయడంతో పాటు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేంతవరకు ఈ సమన్వయకర్తల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇక, పార్టీ అనుబంధ సంఘాలను వేదికగా చేసుకుని ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమావేశాలు పూర్తి చేశారు. టీపీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మున్షీ, ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సికింద్రాబాద్‌లో క్రిస్టియన్ సంఘాలతో భేటీ అయి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఈనెల 25 తర్వాత సీఎం జిల్లాల పర్యటన
బూత్‌స్థాయి నుంచి కార్యకర్తలను కదిలించేందుకు హైదరాబాద్ వేదికగా భారీ సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించబోతోంది. ఈ నెల 25న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై రాష్ట్రంలోని 44వేల మంది పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని, ఆ తర్వాత లోక్‌సభ సమన్వయకర్తల హోదాలో రాష్ట్ర మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా కేడర్‌ను కదలిస్తారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment