ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా
ఖర్గే నివాసంలో ‘ఇండియా’ కూటమి నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాఘవ్ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్.బాలు, జమ్మూకశీ్మర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు.
సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు.
బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్
ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment