
ఖమ్మం మయూరి సెంటర్ : సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబాన్ని పథకం ప్రకారమే బీజేపీ ఇబ్బంది పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన గురువారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు.
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా, వాటికి జాతీయహోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని హామీలపై ఇటీవల సీఎం కేసీఆర్‌కు వివరిస్తే.. కార్యాచరణకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. జనవరి నుంచి ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ హామీలపై పోరాటాలు చేయనున్నట్లు వీరభద్రం వెల్లడించారు.