సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు.
సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు.
పొత్తు సాధ్యం కాక...
తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
మరోవైపు బీఆర్‌ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్‌రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment