సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది.
కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు!
పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు.
ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment