
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దళిత శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయంపై టీడీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి. రాళ్ల దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పదేపదే కవ్వింపు చర్యలకు దిగారు టీడీపీ కార్యకర్తలు.
ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment