
టీఎంసీకి రాజీనామా చేసిన నటి, ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీదీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సినీ నటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ చేరారు. టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపారు.
‘నేటితో తృణమూల్‌తో నాకు ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. పార్టీలో ఏ కీలక పదివి లేదు కనుకే రాజీనామా చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. పదేళ్లుగా రేడిఘి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించాను. ప్రస్తుతం అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశాను. సుధీర్ఘ కాలం ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు’ అంటూ లేఖలో పేర్కొన్నారు దేబశ్రీ.
రేడిఘి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు దేబశ్రీ రాయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఆమెకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఇక భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు దేబశ్రీ. అయితే నటి బీజేపీలో చేరుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. 2019లోనే ఆమె బీజేపీలో చేరాలని భావించారు. కానీ కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ చటర్జీ ఆమెను బుజ్జగించి టీఎంసీలోనే కొనసాగేలా చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment