
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత బెనర్జీ (ఫోటో కర్టెసీ : ఇండియా టుడే)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఘటన గురించి టీఎంసీ నాయకులు బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీపై ఎలాంటి దాడి జరగలేదని.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు.
నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్వీట్ షాప్ ఉంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నా షాప్ ఎదురుగానే జరిగింది. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఒక యూటర్న్ దగ్గర సంఘటన జరిగింది. మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదు’’ అన్నారు.
ఏఎన్‌ఐ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీదీని ఎవరు నెట్టలేదని.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఏఎన్‌ఐ ఈ ప్రకటన చేసింది. అంతేకాక ఈ ఇద్దరు వ్యక్తులు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. "సీఎంను చూడటానికి జనం గుమిగూడారు. ఈ గందరగోళంలో ఆమె కాళ్లకి కారు డోర్ తగిలి కింద పడ్డారు. దాంతో దీదీ మెడ, కాలికి గాయాలయ్యాయి. అంతే తప్ప ఆమెను ఎవరు నెట్టలేదు’’అని సుమన్ మైటీ అనే విద్యార్థి ఏఎన్‌ఐకి తెలిపాడు.
మరో ప్రత్యక్ష సాక్షి చిత్రంజన్ దాస్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ "మమతా బెనర్జీ దేవాలయాల సందర్శన నుంచి తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు. దాంతో అది ఆమె కాలికి తగిలి గాయలయ్యాయి’’ అన్నారు. ఇక సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. తనపై జరిగిన దాడిని మమత కుట్రగా వర్ణించారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని ఆమె ఆరోపించారు.
చదవండి:
మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment