పటాష్‌పూర్‌లో మాట్లాడుతున్న మమత
ఇగ్రా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్యోధునుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుశ్శాసనుడు అని నిప్పులు చెరిగారు. తన పార్టీ నుంచి ఫిరాయించి, బీజేపీలోకి చేరి, తనపైనే పోటీకి దిగిన సువేందు అధికారి ఒక ద్రోహి(మీర్ జాఫర్) అని మండిపడ్డారు. ఆమె శుక్రవారం ఇగ్రా, తూర్పు మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో చక్రాల కుర్చీలో కూర్చొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ తమకు అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీ ముఖం చూడడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు. అల్లర్లు, లూటీలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్ జాఫర్ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు. మమత ఏం మాట్లాడారంటే..
ద్రోహులంతా వెళ్లిపోయారు
‘’మా పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన నేతలంతా ద్రోహులు. వారు వెళ్లిపోవడంతో మాకు మంచే జరిగింది. మా పార్టీ ప్రక్షాళన అయ్యింది. ఆ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని, లూటీలు చేస్తోంది, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. పరివర్తన్(మార్పు) అంటూ నేను ఇచ్చిన నినాదాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారు. సువేందు అధికారిని గుడ్డిగా నమ్మాను. అతడు మాత్రం నన్ను మోసం చేశాడు.
మనిషి ఎదురుగా హరి హరి అని జపం చేసే బీజేపీ నేతలు వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తారు. ఇకపై ‘నో ఓటు టు బీజేపీ’ అనేది మన నినాదం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) గోల్‌మాల్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి’’ అని కోరారు.
బీజేపీ దోపిడీ సంగతేంటి?
నేను కోల్‌కతాలో కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి కారణం బలవంతపు భూసేకరణపై ప్రజా పోరాటం ఇక్కడే పురుడుపోసుకుంది. ఈ పోరాటం జరిగినప్పుడే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. బెంగాల్‌లో ప్రతి ప్రాంతం నా సొంత ప్రాంతమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదు. ఒక పేదవాడు రూ.500 దొంగతనం చేస్తే పట్టుకొని శిక్షిస్తున్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న బీజేపీ సంగతేంటి? బీజేపీ నేతలు సాగిస్తున్న ఈ దోపిడీ ప్రజలకు తెలియడం లేదు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఢిల్లీలో బీజేపీని గద్దె దింపడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని మమతా బెనర్జీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment