ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పార్టీ పనితీరు ఉండాలి
ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఓవరాక్షన్ చేసిన ఎవరినీ వదిలిపెట్టం : పేర్ని నాని
అట్టహాసంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ బాధ్యతల స్వీకారం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని.. ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పనితీరు ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు.
అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలతో బిహార్‌లా మారుస్తున్నారని.. సూపర్‌సిక్స్‌కు బొందపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకోవాలని.. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశముందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోస్తున్నారు : పేర్ని నాని
మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను ఓడిస్తే తమకు మంచి జరుగుతుందని జనసేన కార్యకర్తలు భ్రమపడ్డారని.. కానీ, ఇప్పుడేమో వారు టీడీపీ పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. మానసికంగా వారంతా చచ్చి బతుకుతున్నారని, వాళ్ల పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. వైఎస్సార్‌సీపీకి ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు.
వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని.. కేసులు పెట్టారని, రోడ్ల మీద కొట్టి దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. ఇలా ఓవరాక్షన్ చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఇక మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్‌సీపీకి ఏమీకాదని, తాము తగ్గేదేలేదని పేర్ని నాని స్పష్టంచేశారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు పేర్ని భరోసా ఇచ్చారు.
ప్రజలకు కష్టమొస్తే జగన్‌ను తలుచుకుంటున్నారు : అవినాష్
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తలుచుకుంటున్నారని.. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడమే అందుకు కారణమన్నారు. టీడీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment