హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రధాన పోటీ అని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఆ పార్టీ గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పెద్దగా అసంతృప్తి ఛాయలు పెద్దగా కనిపించని రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరినట్లే ఉంది. తెలంగాణ బీజేపీలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనేది తాజాగా బయటపడింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే విషయం బహిర్గతమైంది.
జితేందర్‌రెడ్డి వివాదాస్పద ట్వీట్!
మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమయ్యింది. దున్నపోతుల్ని వ్యాన్‌లోకి ఎక్కించే ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన జితేందర్‌రెడ్డి.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌తో సహా పలువురిపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న జితేందర్‌రెడ్డి.. ఇప్పుడు అందులో భాగంగా దున్నపోతుల వీడియో-దానికి క్యాప్షన్ ఇవ్వడం ఒక్కసారిగా అలజడి రేపింది రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో..
అధిష్టానానికి జితేందర్‌రెడ్డి వ్యవహారం!
ఈ ట్వీట్ వ్యవహారం ఇప్పటికే అధిష్టానానికి చేర్చారు స్థానిక నేతలు. అసలు దున్నపోతుల వీడియో.. ఈ ట్రీట్‌మెంట్ అవసరం అని ఎవరిని ఉద్దేశించి పెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ట్విట్టర్‌లో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి జితేందర్‌రెడ్డి వెనుకాల ఎవరున్నారనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా జితేందర్‌రెడ్డి అసంతృప్తా.. ఆక్రోషమా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ యత్నం
దీన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో క్రమేపీ బలాన్ని తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్.. బీజేపీలో విభేదాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకూ బీఆర్‌ఎస్-బీజేపీ ఒకటే అంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్న కాంగ్రెస్.. బీజేపీ తాజా వివాదంపై స్పందించింది. తెలంగాణ బీజేపీలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొకవైపు బీజేపీలో కొత్తగా చేరిన నేతలు మాత్రం అంతర్మథనంలో పడ్డారు.
బీజేపీలో పట్టాలు తప్పిన క్రమశిక్షణ
అధిష్టానం ఆదేశాలతో గీత దాటుతున్న నేతలకు వార్నింగ్ లెటర్ విడుదల చేశారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు. క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరి సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను సహించేది లేదన్నారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. ‘
పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదు. పార్టీలో ఒక 'లక్ష్మణ రేఖ' ఉందని మర్చిపోకూడదు. మా పార్టీకి చెందిన కొందరు నాయకులు, పార్టీకి నష్టం చేకూరేలా చేస్తోన్న అవాంఛనీయ బహిరంగ ప్రకటనలు, మీడియా లీకులు, యథాలాపంగా చేస్తోన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు, చేస్తోన్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోతున్నారా?, ఇది బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కాదు.. బీజేపీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవస్థ బీజేపీలో లేవు. ఉండవు. ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తోన్న వాళ్లంతా పార్టీలో కీలక హోదాలలో ఉన్నవారే. వాళ్లకు తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశాలు ఉన్నాయి.. ప్రత్యేక వేదిక కూడా ఉంది’ అని పేర్కొన్నారు.
This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
Comments
Please login to add a commentAdd a comment