
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మరో నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఈ మేరకు ఏపీ బీజేపీ ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సదరు లేఖలో పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
(డాక్టర్ ఓవీ రమణపై బీజేపీ సస్పెన్షన్ వేటు)