ఇదేం ఖర్మ బాబూ!? | Discontent is growing day by day in the joint Anantapur TDP | Sakshi
Sakshi News home page

Anantapur: బాబు కాళ్లబేరం..తమ్ముళ్ల గరంగరం

Published Fri, Feb 9 2024 8:34 AM | Last Updated on Fri, Feb 9 2024 8:34 AM

Discontent is growing day by day in the joint Anantapur TDP - Sakshi

ఒంటరిగా వెళ్తే గెలవలేమని తేలిపోయింది. కనీసం ఓ వర్గం ఓట్లయినా లాక్కుందామనే దూరాశతో రోజుకో మాట మాట్లాడే ఆయన్ను పక్కన తెచ్చుకున్నారు. ఇంకా భయం పోలేదు. ‘‘ఆవేశం రాదా అండీ?’’  అంటూ ఒకప్పుడు ధ్వజమెత్తిన వారి వద్దకే కాళ్లబేరానికి సైతం వెళ్లిపోయారు. మీరెంతంటే అంతే, మీకివి.. మాకవి అంటూ దిగజారిపోయారు.

ఆయన తీరేమో గానీ, ఇన్నాళ్లూ పార్టీ పల్లకీ మోసిన నేతల్లో మాత్రం కలవరం మొదలైంది. తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోనని లోలోనే కుమిలిపోతున్నారు. పొత్తుల కోసం అర్రులు చాస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలిపై ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పూటకో మాట.. రోజుకో నిర్ణయం చందాన చంద్రబాబు చేష్టలు ప్రజలను విస్మయానికి గురి చేస్తుండడమేమో గానీ, ‘తమ్ముళ్ల’లో మాత్రం గుబులు రేపుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఆయన ఇప్పటికే జనసేనతో పొత్తు అంటూ వారిని పక్కలో బల్లెం లాగా కూర్చోబెట్టడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తాజాగా బీజేపీతోనూ పొత్తు ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు. జాతీయ పార్టీల నిరంకుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని.. ఇప్పుడు మళ్లీ అవే పార్టీల పాదాల వద్ద మోకరిల్లేలా వ్యవహరిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు సీట్లు ఇస్తారని ప్రచారం 
బీజేపీ, జనసేన పొత్తులు ఖరారైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు సీట్లు ఆ రెండు పార్టీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వరదాపురం సూరి.. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ధర్మవరంలో పోటీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అనంతపురం అర్బన్‌ సీటు జనసేన కోరుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌రెడ్డిని జనసేనలో చేర్పించి అనంతపురం నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఏపార్టీలో ఉన్నా మనవాడే కదా అన్నది చంద్రబాబు ఆలోచన. దీనిపై మిగతా నాయకులు ససేమిరా అంటున్నారు. వరదాపురం సూరికి టికెట్‌ ఇస్తామనడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. అలాగే పవన్‌రెడ్డికి జనసేన టికెట్‌ అనడంపై ఇక్కడ వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ససేమిరా అంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీతో అంటకాగుతున్న తీరు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందని కళ్యాణదుర్గం టీడీపీ నాయకుడొకరు వాపోయారు. 

ఓట్లే లేనప్పుడు సీట్లు ఎందుకు? 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లుఉన్నాయి. ఇందులో ఎక్కడా జనసేన ప్రభావం నామమాత్రంగా కూడా లేదు. అయితే చంద్రబాబు ఏ సభ నిర్వహించినా చోటామోటా జనసేన నేతలకు సభలో పెద్దపీట వేయాల్సి వస్తోంది. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టుమని 10 ఓట్లు లేని వారు కూడా స్టేజీపై దర్జాగా కూర్చోవడంతో రగలిపోతున్నారు.

ఇక ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు అంటే తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వారికి ఓట్లే లేనప్పుడు పొత్తు పెట్టుకుని సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటున్నారు. చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారా లేదా పార్టీ పరిస్థితి పాతాళానికి వెళ్లిందా అన్నది అర్థం కావడం లేదని పుట్టపర్తికి చెందిన ఒక సీనియర్‌ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement