5 States Assembly Elections 2022: EC Announced Full Schedule, Polls Dates - Sakshi
Sakshi News home page

Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేసే అవకాశం

Published Sat, Jan 8 2022 3:48 PM | Last Updated on Fri, Jan 21 2022 2:41 PM

Election Commission Announces 5 State Assembly Elections 2022 Dates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు
జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌
తొలి దశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి - 10
(యూపీలో మాత్రమే)

రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 21న
రెండో దశ పోలింగ్‌ ఫిబ్రవరి -14
-(పంజాబ్‌, గోవా,ఉత్తరాఖండ్‌, యూపీ)
-ఒకే దశలో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికలు

మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 25న
మూడో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -20 (యూపీ)

నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 27న
నాలుగో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -23 (యూపీ)

ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 01న
ఐదో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్‌)

ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 04న
మార్చి 3న ఆరో విడత ఎన్నికలు
(యూపీ, మణిపూర్‌)

ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 10న
మార్చి 7న ఏడో విడత ఎన్నికలు (యూపీ)

మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

షెడ్యూల్‌ విడుదల సందర్భంగా చీఫ్‌ ఎన్నికల ఆఫీసర్‌ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్‌ సేఫ్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించాం. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపాం.

ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం
మాస్క్, థర్మల్ స్కానర్లు,  శానిటేషన్  తదితర లాజిస్టిక్స్ అన్ని  పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతాం. కరోనా నేపథ్యంలో 2,15, 368 పోలింగ్ కేంద్రాలు పెంచాం. 16 శాతం పోలింగ్ కేంద్రాలు పెంచాం. యూపీలో ప్రతి పోలింగ్  స్టేషన్లో సగటున 862 మంది ఓటర్లు ఓటు వేస్తారు. దీనివల్ల పోలింగ్ కేంద్రాలలో రద్దీ తగ్గుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాం. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి. అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్‌ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ..28లక్షలుగా ఉంది. డబుల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్‌ సోకిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. 

రోడ్‌షోలు రద్దు
ఐదు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ రేటును పరిశీలించాము. పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతున్నాం. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. 

మరోవైపు దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా?లేదా? అనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో.. ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఎన్నికలు జరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని భావించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
యూపీలో అసెంబ్లీ స్థానాలు - 403
పంజాబ్‌లో అసెంబ్లీ స్థానాలు - 117
ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాలు - 70
గోవాలో అసెంబ్లీ స్థానాలు - 40
మణిపూర్‌లో అసెంబ్లీ స్థానాలు - 60 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement