సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన నాటి నుంచే కొనసాగుతున్న ఊహాగానాలు ఇంకా ఆగడం లేదు. తాజాగా బీజేపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపైనా ఈటల శిబిరం నుంచి స్పందన లేదు. బీజేపీలో చేరేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో పార్టీ మారే నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను ఒకతాటిపైకి తెచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, బిగించిన పిడికిలితో సామాజిక మాధ్యమాలలో ఈటల పేరిట పోస్టింగులు పెడుతున్న వారు అంటున్నారు. అయితే.. ఈటల మాత్రం ఈ ప్రచారాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
టీఆర్‌ఎస్ వ్యతిరేకులతో మంతనాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల తరువాతి పరిణామాల్లో వివిధ పార్టీల నేతలను కలిశారు. టీఆర్‌ఎస్‌లో ఉంటూనే నిరాదరణకు గురైనట్లు భావిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు ఆయనను కలిసి మద్దతుగా నిలిచారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మరో ముఖ్యనేత డి.శ్రీనివాస్‌తోపాటు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులను ఈటల స్వయంగా కలిసి చర్చించారు. వీహెచ్ వంటి నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో తటస్థులు ఆయనను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలని కోరుతుండగా, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.
ఈటలకు బీజేపీ గాలం
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతగా కొనసాగిన ఈటల రాజేందర్‌ను చేరదీయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు ఈటలతో సమాలోచనలు జరిపారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఈటలతో ఫోన్‌లో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. తాను ఏ పార్టీలో చేరినా, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసినా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యం కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీనే బెటర్ ఆప్షన్‌గా..
రాష్ట్రంతోపాటు హుజూరాబాద్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల బీజేపీలో చేరడమే బెటర్ అని జిల్లా రాజకీయ విశ్లేషకులు, ఈటల వర్గీయులు భావిస్తున్నారు. ఈటలను పార్టీ నుంచి పంపే దిశగా జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తోపాటు ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పావులు కదుపుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటల వెంట ఉన్న ప్రజాప్రతినిధులను మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో కొనసాగేలా అందరితోనూ సమావేశమయ్యారు. ఈటల వెంట ఉన్న పార్టీ నాయకులను ఆయనకు దూరం చేసే ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఉప ఎన్నిక లేదా సాధారణ ఎన్నిక జరిగినా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. ఈటల ఆత్మగౌరవం నినాదానికి బీజేపీ తోడైతే హుజూరాబాద్‌లో తిరుగు ఉండదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈటలకు బీజేపీలో చేరడం తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడొకరు వ్యాఖ్యానించారు. సొంత పార్టీ పెట్టి టీఆర్‌ఎస్‌ను ఢీకొనే పరిస్థితులు రాష్ట్రంలో లేనందున ఉభయకుశలోపరిగా బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.
వేచి చూస్తూనే.. టీఆర్‌ఎస్‌పై పోరు ఆలోచన
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచాయి. మరో రెండేళ్ల తరువాతే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనా ప్రస్తుతం ఈటల టెక్నికల్‌గా టీఆర్‌ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఆయన రాజీనామా చేసినా, లేదా వేరే పార్టీలో చేరి కండువా కప్పుకున్నా.. ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేసినా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. అలాంటప్పుడు వేరే పార్టీలో చేరి లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ‘మాజీ’గా ఉండడం ఈటలకు ఇష్టం లేదని సమాచారం. ఉద్యమ సహచరుడిగా తనకున్న పేరుతోనే టీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేసే పనిలో టీఆర్‌ఎస్ అసమ్మతి వాదులను, పాత ఉద్యమకారులను ఒకతాటిపైకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే.. బీజేపీ నాయకత్వం మాత్రం ఆయనను వీలైనంత త్వరలో పార్టీలోకి లాగే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment