హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైన వేళ స్థానిక యువ నేత పాడి కౌశిక్‌రెడ్డి తీరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ, ఏమాత్రం కుంగిపోకుండా స్థానికంగా తన బలాన్ని పెంచుకుని, వచ్చే ఎన్నికలోనైనా గెలవాలనే పట్టుదలతో ముందుకుసాగారు. అయితే, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈటల రాజీనామా, టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడం, ఉప ఎన్నిక జరుగనుండటం తెలిసిందే.
దీంతో ఒక రకంగా కౌశిక్‌రెడ్డికి మరో అవకాశం వచ్చినట్లయిందని ఆయన అనుచరులు భావించారు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా టికెట్ ఆయనకే ఇస్తుందని, గతంలోని చిన్న చిన్న పొరబాట్లు సరిచేసుకుని ఈసారి ఎలాగైనా కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతారని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ఉప ఎన్నిక తేదీ ఖరారుకాకపోయినప్పటికీ టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచార దూకుడు పెంచితే, కాంగ్రెస్‌లో మాత్రం అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల సీనియర్ నేతలు ఇప్పటికి అన్యమస్కంగానే ఉండటం, అసంతృప్తిని వెళ్లగక్కడం తెలిసిందే.
మరోవైపు.. బలమైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్ వెదుకులాట, అదే సమయంలో పాడి కౌశిక్‌రెడ్డి కేటీఆర్‌ను కలవడం వంటి విషయాలు రాజకీయవర్గాలను ఆకర్షించాయి. ఒకవేళ కౌశిక్ పార్టీని వీడితే.. రేవంత్‌రెడ్డి ఎలా ముందుకు సాగుతారు, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నికను ఎలా గట్టెక్కిస్తారన్న అంశం గురించి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఇందుకు స్పందించిన అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. దీంతో కౌశిక్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ సందర్భంగా సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన కౌశిక్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
‘‘రేవంత్‌రెడ్డి వల్ల ఒక్కరు కూడా సంతోషంగా లేరు. అరె.. నేనే రాజా, నాదే సినిమా అంటే ఎలా? ఆయన నిజంగా మార్పు తీసుకువస్తారు అనుకుంటే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని ఒక్క డివిజన్‌లో కూడా డిపాజిట్ ఎందుకు రాలేదు. టికెట్లు నువ్వే ఇచ్చుకున్నావు. డబ్బులు నువ్వే ఇచ్చావు. మరి ఎందుకు ఇలా జరిగింది. సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు తెచ్చుకోలేదు రేవంతన్న నువ్వు రాష్ట్రంలో ఏమి చేస్తావ్. యుద్ధానికి సై అనెటోడే ప్రెసిడెంట్‌గిరీ తీసుకోవాలి.
ఓడిపోతామని నువ్వే చెప్తే ఎట్లా. మస్తు ముచ్చట్లు జెప్తాం కానీ.. సినిమాల్లో ముమైత్‌ఖాన్ కనిపిస్తే మస్తు సీటీలు కొడుతరు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో ముమైత్ ఖాన్ ఈ రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేనోడు సీఎం ఎలా అయితడు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తనకు టిక్కెట్టు రాకుండా చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేశారని, ఆయన వల్లే ఆలస్యమైనప్పటికీ, 15 రోజుల్లో టికెట్ తెచ్చుకుని.. ఈటల రాజేందర్‌కు చుక్కలు చూపించానని పేర్కొన్నారు. ఒక కాంగ్రెస్‌వాదిగా బాధతోనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా తనను ఓడించే ప్రయత్నాలు చేశారని, రక్తం అమ్ముకుని కొట్లాడుతుంటే ఇలా చేయడం ఏమిటంటూ కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన ఆయన ఇక త్వరలోనే ‘కారెక్కడం’ ఖాయమని, ఈటలకు గతంలో గట్టి పోటీనిచ్చిన కౌశిక్‌నే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంచుకుంటుందని, ఆయన చేరిక ఇక లాంఛనమేననే ప్రచారం జోరందుకుంది. దీంతో.. కరీంనగర్ రాజకీయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉన్న ఒక్కగానొక్క బలమైన అభ్యర్థి చేజారిపోవడం, హుజురాబాద్ సమీప గ్రామాల్లోని స్థానిక నేతలు టీఆర్‌ఎస్, బీజేపీలో చేరుతుండటంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నిక కత్తిమీద సామేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ ఎవరిని రంగంలోకి దింపుతుంది, అభ్యర్థి ఎవరన్న అంశంపై చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment