సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా సన్నిహితులు, అభిమానులు ఆయన సొంతం. టీఆర్‌ఎస్‌తో కొంత కాలంగా విభేదిస్తున్న ఈటలను భూకబ్జాల ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ వెంట పార్టీ నాయకులెవరూ వెళ్లకుండా బలగాలను మోహరించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి టి.హరీష్‌రావును పర్యవేక్షకులుగా నియమించారు.
మండలానికి ఓ నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించి మంత్రి గంగుల ‘ఆట’ మొదలు పెట్టారు. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ వరకు ప్రజాప్రతినిధులు ఎవరూ ఈటల వెంట వెళ్లకుండా చూడడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈటల బీజేపీలో చేరడమే శరణ్యమనే పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే బీజేపీలో చేరనున్న ఈటల వెంట ఎవరు కలిసి నడుస్తారనేది ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. మంత్రివర్గం నుంచి ఉద్వాసన తరువాత జిల్లాకు చెందిన జెడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ ఈటలను కలిసినప్పటికీ.. ఆమె భవిష్యత్ నిర్ణయమేదీ తెలియరాలేదు. ఉమ్మడి జిల్లాలో ఈటల వెంట వెళ్లే పెద్ద నాయకులు ఎవరూ లేకపోగా హుజూరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లోనే ఉండాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
చదవండి: నేడు నడ్డాతో ఈటల భేటీ..రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
రెండు దశాబ్దాల అనుబంధానికి తెర
టీఆర్‌ఎస్ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటల ఒకరు. బీసీ నాయకుడిగా పార్టీలో అనతికాలంలోనే ఎదిగిన ఆయన కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా ప్రతి కీలక ఘట్టంలో కొనసాగారు. 2014లో తెలంగాణ సిద్ధించి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన తొలి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధినేతతో పెరుగుతూ వచ్చిన దూరం చివరకు మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకూ వెళ్లింది. పార్టీతో ఆయనకున్న రెండు దశాబ్దాల అనుబంధం బీటలు వారింది. ఇక కాషాయ జెండాతో కొత్త అవతారంలోకి మారనున్నారు. అదే సమయంలో జిల్లాలో రాజకీయాలు కూడా మారనున్నాయి.
కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధం
ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కలిసేందుకు ఈటల ఆదివారం బయల్దేరి వెళ్లడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాను సోమవారం కలుసుకోనున్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి ఈటలను నడ్డాతో భేటీ చేయించే అవకాశం ఉంది. నడ్డాతో సమావేశం సందర్భంగా ఈటల కాషాయ కండువా కప్పుకుంటారా..? లేక చర్చలు జరిపి చేరిక ముహూర్తం తరువాత నిర్ణయిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఈటల బీజేపీలో చేరే విషయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment