సాక్షి, తాడేపల్లి: ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని.. అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించారు.
‘‘నాగార్జునసాగర్ కుడి కెనాల్‌కు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్నిచేయబోతున్నారు?’’ అని అంబటి రాంబాబు నిలదీశారు.
‘‘రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటి?. తెలంగాణ డిమాండ్లను చంద్రబాబు అంగీకరించినట్టేనా?. నాగార్జునసాగర్‌లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.
‘‘వైఎస్ జగన్ చొరవతో పోలవరం విషయంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో వివాదాలు పరిష్కారం అయ్యాయి. పోలవరం విషయంలో ఏపీకి ద్రోహం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఆలస్యం కాలేదు. చంద్రబాబు నది మధ్యలో కాఫర్ డ్యాం కట్టడం వల్లే పోలవరం ఆలస్యానికి కారణం’’ అని అంబటి వివరించారు.
‘‘రాష్ట్ర విభజన వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన జరిగాక మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు. పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండేది. అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. చంద్రబాబు తప్పు చేసినందునే మెడ పట్టుకుని గెంటేశారు. రాష్ట్రానికి రావాల్సినది ఏదీ తీసుకుని రాకుండా ఎందుకు పారిపోయారు. తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకి అన్యాయం చేశారు.
..మొన్నటి సీఎంల సమావేశంలో అసలు చంద్రబాబు ఏం చర్చించారు?. విద్యుత్ బిల్లు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా దానిపై ఎందుకు చర్చించలేదు?. నాగార్జునసాగర్ లో నీరు విడుదల చేయటానికి కూడా తెలంగాణ మీద ఆధారపడేలా చేశారు. శ్రీశైలంలో విద్యుత్ సరఫరా విషయమై ఎందుకు మాట్లాడటం లేదు?. ఏపీలో సముద్రం తీరంలో టీటీడీలో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ కోరింది.
..ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యక్తిగత అంశాల కోసం ఏపీకి చెందిన గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా?. అసలు ఇద్దరు సీఎంల మధ్య సమావేశాలు జరిగితే దేని గురించి చర్చించారో ఎందుకు చెప్పటం లేదు?. చర్చలను రహస్యంగా ఉంచటానికి కారణం ఏంటి?. రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని చంద్రబాబు అనటం వెనుక కుట్ర ఏంటో బయట పెట్టాలి. పోలవరానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపబోతున్నారు. పోలవరం కాంట్రాక్టరుని మార్చటం వలనో, రివర్స్ టెండర్ వలనో నష్టం జరగలేదు. చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే నష్టం జరిగింది
..వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు ఇంకా మాట్లాడుతున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోతే జగన్ విజృంభిస్తారు. విభజనచట్టంలో ఉన్న ప్రత్యేక హోదా హామీని చంద్రబాబు ఎందుకు అడగటం లేదు?. 9, 10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాన్ని ఎందుకు అడగటం లేదు. పోలవరంపై ఏం చర్చించారో బయట పెట్టాలి. అసలు విషయాలను పక్కన పెట్టి డ్రగ్స్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్ జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు. ఆయనకు అభిమానులు ఎక్కువ’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment